రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీల లెక్క కొలిక్కి

  • టీచర్ల ఖాళీల లెక్కలు కొలిక్కి 
  • బీఈడీ చేసినోళ్లకూ ఎస్జీటీ పోస్టుకు చాన్స్‌‌‌‌
  • టెట్‌‌‌‌కు పెరుగుతున్న అప్లికేషన్లు
  • ప్రమోషన్లు ఇస్తే..మరో 9 వేల టీచింగ్‌‌‌‌ పోస్టులు


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ల పోస్టుల ఖాళీల లెక్క తేలింది. స్కూల్ ఎడ్యుకేషన్​పరిధిలో13,086 పోస్టులు భర్తీ చేయనున్నట్టు సర్కారు ఇటీవల ప్రకటించింది. అయితే అందులో టీచర్ల పోస్టులు ఎన్ని, నాన్‌‌‌‌ టీచింగ్‌‌‌‌ పోస్టులు ఎన్ని అనే దానిపై క్లారిటీ లేదు. దీనిపై విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని ఏఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలు సేకరించిన విద్యాశాఖ అధికారులు, ఆ లిస్టును సర్కారుకు అందించారు. ఆ లిస్టు ప్రకారం సర్కారు బడుల్లో 6,700 ఎస్జీటీ పోస్టులు, 2,200 స్కూల్ అసిస్టెంట్‌‌‌‌ పోస్టులను భర్తీ చేయనున్నట్టు సమాచారం. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2017లో మొదటిసారిగా ప్రభుత్వం టీఆర్టీ నిర్వహించింది. ఆ తర్వాత ఇప్పుడే టీచర్‌‌‌‌‌‌‌‌ పోస్టులను భర్తీ చేయడానికి రెడీ అవుతోంది. అయితే 2015 తర్వాత టీచర్లు, ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు గనుక వారికి ప్రమోషన్లు ఇస్తే దాదాపుగా 9 వేల టీచింగ్‌‌‌‌ పోస్టులు ఖాళీ అయ్యే చాన్స్ ఉంది. 

నాన్‌‌‌‌టీచింగ్‌‌‌‌ పోస్టులు కూడా..

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ చెప్పిన 13,086 పోస్టుల్లో అన్నీ టీచింగ్‌‌‌‌ పోస్టులేనని నిరుద్యోగులతోపాటు సంబంధిత శాఖ మంత్రి కూడా భావించారు. అయితే నాన్‌‌‌‌ టీచింగ్‌‌‌‌ పోస్టులు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ముందుగా స్కూల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ అధికారుల నుంచి ఖాళీల వివరాలు సేకరించి ఖాళీల భర్తీని ప్రకటించాల్సిన సర్కారు.. ఫైనాన్స్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ వద్ద ఉన్న లెక్కల ప్రకాం పోస్టులు భర్తీ చేయనున్నట్టు ప్రకటించినట్టు తెలిసింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన శాంక్షన్డ్‌‌‌‌, వర్కింగ్‌‌‌‌, వేకెంట్‌‌‌‌ పోస్టుల డేటాను అధికారులు సేకరించి, ఆ లిస్టును సర్కారుకు పంపించారు. అయితే అధికారులు ఇచ్చిన లిస్టులో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేయబోరని, సర్కారు ఫైనల్ చేసిన ఖాళీలను మాత్రమే ఫిల్‌‌‌‌ చేస్తారని చెబుతున్నారు.  

ఖాళీలు లెక్కలు తేలినయ్..

సర్కారు ప్రకటించిన 13 వేల పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌‌‌‌జీటీ) పోస్టులు 6,700 ఉండగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,200 వరకు ఉన్నాయి. పండిట్ పోస్టులు 700, పీఈటీ, పీడీ పోస్టులు 170 , మోడల్ స్కూల్స్‌‌‌‌లో 800 , తెలంగాణ సొసైటీ గురుకులాల్లో 90 వరకూ ఖాళీలను భర్తీ చేయనున్నట్టు తెలిసింది. అలాగే 24 డిప్యూటీ డీఈవో పోస్టులను కూడా ఫిల్‌‌‌‌ చేస్తారని సమాచారం. ఇక, మిగిలిన పోస్టులు ఎస్‌‌‌‌సీఈఆర్టీ, లైబ్రరీలు, టెక్స్ట్‌‌‌‌ బుక్ ప్రింటింగ్ ప్రెస్, సైట్, డైట్ తదితర సంస్థల్లోని పోస్టులేనని చెప్తున్నారు.

ఎస్జీటీకే ఫుల్ డిమాండ్..

ఈసారి ఎస్‌‌‌‌జీటీ పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో పోస్టులు భర్తీ చేస్తుండటంతోపాటు బీఈడీ చేసిన వాళ్లు కూడా ఎస్జీటీకి అప్లై చేసుకునే చాన్స్‌‌‌‌ ఉంది. దీంతో బీఈడీ చేసిన అభ్యర్థులు ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా పోటీ పడుతున్నారు. దీనికి అనుగుణంగా టెట్‌‌‌‌కు అప్లై చేసుకుంటున్న వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. అయితే 2017లో జరిగిన టీఆర్టీలో 5,415 ఎస్జీటీ పోస్టులకు డీఈడీ చేసిన అభ్యర్థులు 60 వేల మందికిపైగా పోటీ పడగా, రెండు వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు రెండు లక్షల మంది పోటీపడ్డారు. ఈసారి ఎస్‌‌‌‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 4 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం వరకు టెట్‌‌‌‌కు రెండు లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని తెలుస్తోంది.