- ఈ ఏడాదే వైరా రిజర్వాయర్‌కు గోదావరి జలాలు
- సీతమ్మసాగర్‌తో ముంపు లేకుండా గోదావరికి రెండువైపులా రక్షణ గోడలు
- రెవెన్యూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రికొత్తగూడెం/దమ్మపేట, వెలుగు : సీతారామ ఎత్తిపోతల పథకంతో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి వద్ద గల పంప్‌హౌస్–4 పనులను బుధవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లతో కలిసి పరిశీలించారు. తర్వాత ఆఫీసర్లతో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో తుమ్మల మాట్లాడారు.
రూ.13,500 కోట్లతో చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ పనుల్లో మరింత స్పీడ్ పెంచాలన్నారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.7 వేల కోట్లు ఖర్చయ్యిందన్నారు. మూడు పంప్హౌస్పనులు పూర్తయ్యాయని, టన్నెల్స్పనులు స్లోగా సాగుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. యాతాల కుంట వద్ద టన్నెల్ నిర్మాణం పూర్తయితేనే సత్తుపల్లి ట్రంక్ కెనాల్‌కు, లంకసాగర్ప్రాజెక్ట్కు నీళ్లిచ్చే అవకాశం ఉంటుందన్నారు. డైవర్షన్ లింక్‌తో ఈ ఏడాదే వైరా రిజర్వాయర్‌కు గోదావరి నీళ్లందిస్తామన్నారు. దీనికి తక్కువ ఖర్చే అవుతుందని, ఇంజినీర్లు దృష్టి పెట్టాలన్నారు. నాగార్జునసాగర్ నీళ్లు రాకపోయిన పంటలకు పెద్దగా ఇబ్బంది ఉండదన్నారు. ప్రాజెక్ట్‌కు మరో టన్నెల్ నిర్మించాల్సి ఉందని, అది పూర్తయితేనే పాలేరుకు నీళ్లు వస్తాయని, దీనిపై ఇరిగేషన్, ఫైనాన్స్ మినిస్టర్లతో మాట్లాడుతానన్నారు.
ఒక పక్క సీతమ్మసాగర్, మరో వైపు పవర్‌హౌస్, మూడో టన్నెల్‌కు సంబంధించి పర్మిషన్, ఫారెస్ట్క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉందన్నారు. పవర్హౌస్టెండర్లకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ఈ ఏడాది 1.50 లక్షల ఎకరాలకు, వచ్చే ఏడాది మరో 1.50లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని స్పష్టం చేశారు. సీతమ్మ సాగర్ప్రాజెక్ట్ సమీప గ్రామాలు ముంపునకు గురి కాకుండా రెండువైపులా రక్షణ గోడలు నిర్మించనున్నట్టు తెలిపారు. దీనివల్ల గోదావరికి 63 అడుగుల వరద వచ్చినా ఎలాంటి ముంపు ఉండబోదన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం కలెక్టర్లు ప్రియాంక అల, వీపీ, గౌతం, సీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఈలు వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఈఈలు అర్జున్, సురేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.