సీఎంఆర్ సేకరణకు..గోదాములు చాలట్లే.!

  • సకాలంలో లక్ష్యం చేరేందుకు తప్పని ఇక్కట్లు
  • ఎఫ్​సీఐ గోదాములు ఖాళీ అయితేనే స్పీడప్..​ 
  • జిల్లాలో 68 శాతానికి చేరిన సేకరణ
  • స్టేట్​లో సెకండ్ ప్లేస్ లో జనగామ

జనగామ, వెలుగు: కస్టమ్ మిల్లింగ్​ రైస్ (సీఎంఆర్​) సేకరణకు గోదాములు స్పీడ్ బ్రేకర్లుగా మారాయి. అందులోని నిల్వలు ఖాళీ అయితేనే సేకరణ స్పీడందుకుంటోంది. కానీ, గోదాములు సరిపడా లేని కారణంగా నిర్ణీత గడువులో లక్ష్యం చేరడం మిల్లర్లకు, అధికారులకు సమస్యగా మారింది. రైలు వ్యాగన్లు సరిగా రాక నిల్వలు త్వరగా ఖాళీ కాకపోవడంతో జాప్యం జరుగుతోంది. జులై నెలాఖరు వరకు సేకరణ పూర్తి కావాలని సర్కారు ఆదేశాలివ్వగా, జనగామ జిల్లాలో ప్రస్తుతానికి 68 శాతం పూర్తైంది. 

ఎఫ్​సీఐ గోదాములే దిక్కు..

జనగామలో కస్టమ్​ మిల్లింగ్​ రైస్​ కోసం పట్టణ శివారు యశ్వంతాపూర్ లోని ఎఫ్​సీఐ గోదాములే దిక్కు అయ్యాయి. ఇక్కడ ఆరు పెద్ద గోదాములుండగా, ఒక్కో గోదాము 5 వేల మెట్రిక్​ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 30 వేల మెట్రిక్​ టన్నుల నిల్వకు వీలుంది. ఇవి ఖాళీ అయితేనే మిల్లర్లు పెట్టే సీఎంఆర్ రైస్​ ను ఇక్కడకు తీసుకువచ్చే వెసులు బాటు ఉంది. కాగా, వ్యాగన్లు సరిగా రాక బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. వెంటనే ఖాళీ అవడం లేదు. ఒకసారి వ్యాగన్​ వస్తే 90 లారీల రైస్ వెళ్లిపోయే ఛాన్స్ ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

ఒక్కో లారీలో 29 మెట్రిక్​ టన్నులు (2900 క్వింటాళ్లు) అనగా 2,610 మెట్రిక్​ టన్నుల బియ్యం నిల్వలు బయటకు వెళ్తాయి. కాగా, ప్రస్తుతానికి యశ్వంతాపూర్​ గోదాములను మాత్రమే అందుబాటులో ఉంచుకోవడంతో ఇక్కట్లు తప్పడం లేదు. నిల్వ సామర్థ్యం ఉన్న మరిన్ని గోదాములు అందుబాటులోకి వస్తే సేకరణ పనులు స్పీడప్ అవుతాయని, లేదంటే ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు. ఆఫీసర్లు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని మిల్లర్లు కోరుతున్నారు. 

స్టేట్ లో సెకండ్ ప్లేస్..

గత వానాకాలం సీజన్​ సీఎంఆర్ సేకరణలో జనగామ జిల్లా స్టేట్ లో సెకండ్ ప్లేస్​లో ఉన్నట్లు సివిల్ సప్లై ఆఫీసర్లు చెబుతున్నారు. జిల్లాలో 18 బాయిల్డ్​,  41 రా రైస్ మిల్లులు ఉండగా, 80,864.240 మెట్రిక్​ టన్నుల వడ్లు మిల్లులకు ఇచ్చారు. వీరు బాయిల్డ్​ రైస్ అయితే క్వింటాలుకు 68 కిలోలు, రా రైస్​ అయితే 67 కిలోలు ఎఫ్​సీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన వానాకాలానికి సంబంధించి మిల్లర్లు ఇప్పటి వరకు 68 శాతం అనగా, 35,782.036 మెట్రిక్​ టన్నుల రైస్ ను ఇచ్చారు. మిగిలిన 18,440.853 మెట్రిక్​ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది.

ఇటీవలి యాసంగికి సంబంధించి కూడా సీఎంఆర్ సేకరణ మొదలుపెట్టారు. ఈ సీజన్ లో జిల్లాలోని మిల్లులకు 1,27,089 మెట్రిక్​ టన్నుల వడ్లను కేటాయించగా, ఇప్పటి వరకు 20.06 శాతం టార్గెట్ చేరుకున్నారు. 16,241.066 మెట్రిక్​ టన్నుల బియ్యం ఎప్​సీఐకి ఇవ్వగా, ఇంకా 69,147.457 మెట్రిక్​ టన్నులు  ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ఈ నెలాఖరు వరకు డెడ్ లైన్ ఉండడంతో అందుకు అవసరమైన కసరత్తులు చేస్తున్నట్లు జిల్లా సివిల్​ సప్లై ఆఫీసర్ రోజారాణి తెలిపారు.