- గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు
హనుమకొండ/ మహబూబాబాద్, వెలుగు: లోక్‌సభ పోలింగ్‌ప్రక్రియ ముగిసింది. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని 68.86 శాతం, మహబూబాబాద్పార్లమెంట్ పరిధిలో 71.85 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో గత ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. వరంగ్పరిధిలో పోలింగ్ పర్సంటేజీ పెరిగినా, రూరల్‌తో పోలిస్తే అర్బన్ ఏరియాలోని నియోజకవర్గాల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు. స్ట్రాంగ్‌రూముల్లో అభ్యర్థుల భవితవ్యం ఉండగా, ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
స్టేషన్లో ఎక్కువ.. వెస్ట్‌లో తక్కువ..
వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తంగా 18,24,466 మంది ఓటర్లుండగా, 12,56,301 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 68.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో అత్యధికంగా స్టేషన్‌ఘన్ పూర్ నియోజకవర్గంలో 78.77 శాతం ఓట్లు పోలవగా, అత్యల్పంగా వరంగల్ వెస్ట్ లో 52.68 శాతం మాత్రమే ఓటింగ్ జరగడం గమనార్హం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు నియోజకవర్గాల్లో కలిపి 77.65 శాతం ఓట్లు పోలవగా, ఎంపీ ఎన్నికల్లో అవే నియోజకవర్గాల్లో 68.86 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. దాదాపు 9 శాతం మంది వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా పోలింగ్ జరగగా, ఇప్పుడు ఆ మార్క్ ఏ నియోజకవర్గం కూడా అందుకోలేకపోవడం గమనార్హం.
ఎనుమాములలో వరంగల్ ఈవీఎంలు..
సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను వరంగల్ ఎనుమాముల మార్కెట్ లోని స్ట్రాంగ్ లకు తరలించారు. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో ఉండగా, పెరిగిన పోలింగ్ శాతంపై ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. జూన్ న లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా, అభ్యర్థులందరూ ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మానుకోటలో పెరిగిన పోలింగ్..
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో 2009లో 9,96,402 ఓట్లు పోల్ కాగా, 78.74 శాతం, 2014లో 11,24,372 ఓట్లు పోల్ కాగా, 81.05 శాతం, 2019లో 9,83,535 ఓట్లు పోల్ కాగా, 69.05 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. 2024లో 11,01,030 ఓట్లు పోల్ కాగా, 71.85 శాతం పోలింగ్ నమోదయ్యింది.
మరోసారి అవకాశం రానున్నది..
తనకు మరోసారి ప్రజలు అవకాశం ఇవ్వనున్నారని మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఓటింగ్ శాతం పెరగడంతో తనకు అనుకూలంగా ఉంటుందన్నారు. సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ రవీందర్రావు, జడ్పీ చైర్మన్ బిందు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్లొన్నారు.
భారీ మెజార్టీ రాబోతున్నది..
మహబూబాబాద్ పార్లమెంట్ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించనున్నారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల అభిమానమే తనకు బలమని, మహబూబాబాద్ ఎంపీగా గెలుస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్, ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్, డీసీసీ ప్రసిడెంట్ భరత్ చందర్ రెడ్డి పాల్గొన్నారు.