నిర్మల్​ - ఖానాపూర్​ హైవేలో 7 ఎనిమల్​ అండర్​ పాస్​లు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి నిర్మిస్తున్న ఎన్​హెచ్​ 61లో ఏడు అండర్​పాస్​లు రానున్నాయి. హైవేపై అటవీ జంతువుల ప్రమాదాలను నివారించేందుకు నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​, పర్యావరణ మంత్రిత్వ శాఖ అండర్​పాస్ లు తప్పనిసరిగా ఉండాలని ఆర్​అండ్​బీని ఆదేశించింది. దీంతో రిజర్వ్​ ఫారెస్ట్​ జోన్​లో అండర్​పాస్ కు అధికారులు అంగీకరించారు. వీటి నిర్మాణానికి ఇటీవలే రూ. 80.5 కోట్ల నిధులు విడుదలయ్యాయి. 

నిర్మల్​ నుంచి ఖానాపూర్​ మధ్యలో.. 

నిర్మల్​ నుంచి ఖానాపూర్ మీదుగా జగిత్యాల జిల్లా చల్​గల్​ వరకు ఎన్​హెచ్​ 61 నిర్మాణం జరుగుతోంది. నిర్మల్ , ఖానాపూర్ ప్రాంతాలు కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్ పరిధిలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో నేషనల్​ హైవే 61 ప్రతిపాదనలు నాలుగేండ్ల కింద వచ్చాయి. కానీ, రిజర్వ్​ ఫారెస్ట్​ రూల్స్​వల్ల పనులకు గతంలో అనుమతి రాలేదు. నిర్మల్​ నుంచి ఖానాపూర్​ వరకూ హైవే నిర్మించాలంటే చెట్లు తొలగించాల్సి ఉంటుంది.

పైగా హైవే పై అటవీ జంతువుల ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదాలను నివారించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కలుగజేసుకుంది. అవసరమైన చోట అండర్​పాసులు నిర్మించాలని, రోడ్డు కోసం ఒక్క చెట్టు నరికితే... పది చెట్లు నాటలని రూల్స్​ పెట్టింది. వీటికి ఆర్​అండ్​బీ అధికారులు అంగీకరించడంతో హైవేపనులు షురూ అయ్యాయి. ఈ మార్గంలో వన్య ప్రాణులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలను అటవీశాఖ సర్వే ద్వారా గుర్తించింది. 

ఫండ్స్​ మంజూరు..

రిజర్వ్​ జోన్ లో హైవే నిర్మిస్తున్నందుకు నేషనల్​హైవే ఆర్​అండ్​బీ రూ. 14.30 కోట్లను అటవీ శాఖకు చెల్లించింది. ఈ అండర్ పాస్ ల ను బోరిగామ, మామడ, దిమ్మ దుర్తి మధ్యలో మూడు, దిమ్మదుర్తి – ఎగ్బాల్ పూర్ మధ్య రెండు, ఖానాపూర్ , ఎగ్బాల్ పూర్ మధ్యలో రెండు అండర్ పాస్​లు కట్టాలని అధికారులు నిర్ణయించారు. 

రెండు హైవేల లింక్​ 

నిర్మల్ నుంచి ఖానాపూర్ మీదుగా జగిత్యాల జిల్లా చల్​గల్​ వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే నెంబర్ 61 పనులు పూర్తయితే నిజామాబాద్ జిల్లా జగదల్పూర్ వరకు ఉన్న నేషనల్ హైవే నెంబర్ 63 తో లింక్​ అవుతుంది. ప్రస్తుతం నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. రెండో దశలో ఖానాపూర్​ నుంచి చల్​గల్​ వరకు హైవే పనులు చేపట్టనున్నారు. 

టెండర్​ ప్రక్రియ నడుస్తోంది.. 

నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే పై ఏడు చోట్ల అండర్ పాసులను నిర్మిస్తున్నాం. కొద్ది రోజుల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఇప్పటికే మూడు అండర్ పాస్ ల బాధ్యతను ప్రస్తుత పనులు చేస్తున్న కాంట్రాక్టర్ కు అప్పగించాం. మిగతా నాలుగు అండర్ పాస్ ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ , పర్యావరణ మంత్రిత్వ శాఖ రూల్స్​కుఅనుగుణంగా ఈ అండర్ ు పాస్ ల నిర్మాణాలను చేపట్టనున్నాం. - సుభాష్, డీఈ, నేషనల్ హైవే ఆర్ అండ్ బీ, నిర్మల్.