అధిక వడ్డీ చెల్లిస్తామంటూ రూ.7 కోట్ల మోసం

అధిక వడ్డీ చెల్లిస్తామంటూ రూ.7 కోట్ల మోసం
  • పోలీసులను ఆశ్రయించిన 20 మంది బాధితులు 
  • డీబీ స్టాక్ బ్రోకింగ్ కన్సల్టెన్సీ  మేనేజర్ అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు : తమ కంపెనీలో ఇన్వెస్ట్​చేస్తే పెద్ద మొత్తంలో ప్రాఫిట్స్ వస్తాయంటూ ఓ స్టాక్​బ్రోకరేజ్ కంపెనీ 20 మందిని చీట్​చేసింది. దాదాపు రూ.7 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఈ కేసులో ఒకరిని అరెస్ట్​చేసినట్లు సైబరాబాద్ ఎకనామిక్​అఫెన్సెస్ వింగ్​డీసీపీ ప్రసాద్ తెలిపారు. ఏపీలోని కాకినాడకు చెందిన విజ్జి జగదీశ్​చంద్రప్రసాద్ కూకట్​పల్లిలో డీబీ స్టాక్ బ్రోకింగ్​కన్సల్టెన్సీ పేరిట కంపెనీ స్టార్ట్​చేశాడు. దీపాంకర్​బర్మన్ అనే వ్యక్తి ప్రొప్రైటర్, జగదీశ్​చంద్రప్రసాద్​మేనేజర్​గా వ్యవరిస్తున్నారు. ఇద్దరూ కలిసి పలు స్కీంలను రూపొందించారు.

తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో వడ్డీ, రిటర్న్​ఇస్తామని, ఏడాది స్కీంలో 120 శాతం, ఆరు నెలల స్కీంలో 54 శాతం, మూడు నెలల స్కీంలో 24 శాతం, నెల రోజుల స్కీంలో ఇన్వెస్ట్ చేస్తే 7 శాతం ప్రాఫిట్​ఇస్తామని నమ్మబలికారు. ప్రకటనలను చూసిన పుప్పాలగూడకు చెందిన సాఫ్ట్​వేర్​ఉద్యోగి పంచాక్షర్​రూ.11 లక్షలు ఇన్వెస్ట్​చేశాడు. అయితే రిటర్న్స్​తోపాటు పెట్టుబడి పైసలు కూడా ఇవ్వకుండా జగదీశ్ చంద్రప్రసాద్, దీపాంకర్​బర్మన్​కంపెనీని క్లోజ్​చేశారు. విషయం తెలుసుకున్న పంచాక్షర్ సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా, డీబీ స్టాక్ బ్రోకింగ్​కన్సల్టెన్సీలో పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో రిటర్న్స్​ఇస్తామని నిందితులు ఇద్దరూ 20 మంది నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. మేనేజర్​జగదీశ్​చంద్రప్రసాద్​ను శుక్రవారం ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్ట్​చేశారు. దీపాంకర్​బర్మన్​పరారీలో ఉన్నాడు.