మంచిర్యాల జిల్లాలో రిపోర్టర్లమంటూ వసూళ్లు..ఏడుగురిపై కేసు

మంచిర్యాల జిల్లాలో రిపోర్టర్లమంటూ వసూళ్లు..ఏడుగురిపై కేసు
  • రూ.90 వేలు స్వాధీనం

బెల్లంపల్లి రూరల్, వెలుగు : రిపోర్టర్లమంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఏడుగురిని మంచిర్యాల జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను జైపూర్‌‌ ఏసీపీ వెంకటేశ్వర్లు బుధవారం నీల్వాయి పోలీస్‌‌స్టేషన్‌‌లో మీడియాకు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలానికి చెందిన చొప్పదండి జనార్దన్, తుంగ రమేశ్, మాసాని రమేశ్, తోడేటి సంతోష్, జిల్లపల్లి పోశం, తగడం వెంకటేశ్, డొబ్బల విష్ణు ముఠాగా ఏర్పడ్డారు.

రిపోర్టర్లుగా చెప్పుకుంటూ ఏడాది నుంచి పశువులు, కలప, రేషన్‌‌ బియ్యం రవాణా, అక్రమంగా ఇసుక తరలించే వ్యాపారులను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. గోదావరిఖనికి చెందిన జక్కుల శ్రీధర్, మొగిలి అనిల్ కుమ్రంభీం జిల్లాలోని కౌటాల నుంచి ఎద్దులు కొనుగోలు చేసి తీసుకెళ్తుండగా బుధవారం తెల్లవారుజామున కళ్లెంపల్లి వద్ద అడ్డుకున్నారు. పర్మిషన్లు లేకుండా పశువులను తరలిస్తున్నారని, వ్యాన్‌‌ సీజ్​చేయిస్తామని బెదిరించారు. దీంతో భయపడిన వ్యాపారులు రూ.50 వేలు నగదు ఇవ్వగా, మరో రూ. 30 వేలు ఫోన్‌‌ పే చేశారు. అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఏడుగురు వ్యక్తులు గతంలోనే పలువురి వద్ద సుమారు రూ. 5 లక్షల దాకా వసూలు చేసినట్టు తేలింది. నిందితుల వద్ద కారు, రూ.90 వేలు స్వాధీనం చేసుకున్నారు. రిపోర్టర్ల పేరిట ముఠాగా ఏర్పడిన వారంతా నేరచరిత్ర కలిగినవారని, ఇప్పటికే వీరిపై పలు సెక్షన్ల కింద వివిధ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఏసీపీ తెలిపారు. ఈ ముఠా సభ్యులు ఇంకా ఎవరినైనా బెదిరించినట్లు కంప్లయింట్ చేస్తే న్యాయం చేస్తామని ఏసీపీ సూచించారు. పర్మిషన్ లేకుండా అక్రమంగా పశువులను తరలిస్తున్న వ్యాపారులపై కూడా యానిమల్‌‌ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. చెన్నూర్‌‌ రూరల్​ సీఐ సుధాకర్, నీల్వాయి ఎస్సై శ్యాంపటేల్​ఉన్నారు.