హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ కమాన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డిసెంబర్ 18వ తేదీ సోమవారం తెల్లవారుజామున ఎల్బీనగర్ - ఉప్పల్ రోడ్ లో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి.. రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తి పైకి దూసుకెళ్లి, ఢీకొట్టింది. అనంతరం కమాన్ దిమ్మను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారులో ఉన్న ఏడుగురు యువకులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన కారు చౌటుప్పల్ ఎంఆర్ఓ హరికృష్ణ పేరుతో ఉన్నట్లు తెలుస్తోంది.
హరికృష్ణ కుమారుడు సాయి కార్తీక్.. కారులో తన స్నేహితులతో కలిసి ఓ బర్త్ డే పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తుంది. సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన నలుగురు యువకులను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సాయి కార్తీక్ తో పాటు మరో ఇద్దరు యువకులను కొత్త పేట ఓమ్ని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.