కేదార్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌లో కూలిన హెలికాప్టర్ ఏడుగురు మృతి

కేదార్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌లో కూలిన హెలికాప్టర్ ఏడుగురు మృతి
  • కేదార్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌లో కూలిన హెలికాప్టర్ ఏడుగురు మృతి.. ప్రతికూల వాతావరణం వల్లే ప్రమాదం
  • రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
  • దర్యాప్తునకు సీఎం ధామి ఆదేశం

రుద్రప్రయాగ్: కేవలం 8 నిమిషాల ప్రయాణం.. కానీ గమ్యానికి చేరుకోలేకపోయారు. గాల్లోకి లేచిన కొన్ని క్షణాల్లోనే హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఆరుగురు భక్తులు, పైలట్‌‌‌‌‌‌‌‌ చనిపోయారు. ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లోని రుద్రప్రయాగ్‌‌‌‌‌‌‌‌లో జరిగిందీ ఘోర ప్రమాదం. ప్రతికూల వాతావరణం, సరిగ్గా కనిపించకపోవడంతోనే హెలికాప్టర్ కూలిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ సీఈవో రవి శంకర్ చెప్పారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు సంతాపం ప్రకటించారు.

చనిపోయింది వీరే

గుజరాత్‌‌‌‌‌‌‌‌కు చెందిన పూర్వ రామానుజ్(26), కృతీ బ్రార్(30), ఉర్వి బ్రార్(25).. తమిళనాడుకు చెందిన సుజాత(56), ప్రేమ్‌‌‌‌‌‌‌‌కుమార్(60), కాలా (60).. మహారాష్ట్రకు చెందిన పైలట్ అనీల్ సింగ్(57) చనిపోయారు. 

రూల్స్ పాటిస్తలే

గుప్త్‌‌‌‌‌‌‌‌కాశీ, ఫాటా, సేర్సీ తదితర ప్రాంతాల నుంచి కేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌కు హెలికాప్టర్ సర్వీసులను ఆరేడు సంస్థలు నిర్వహిస్తున్నాయి. కేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్​ నుంచి గుప్త్‌‌‌‌‌‌‌‌కాశీ వంటి ప్రాంతాలకు ఏడెనిమిది కిలోమీటర్ల దూరమే ఉన్నా.. చాపర్లకు డిమాండ్ భారీగా ఉంటోంది. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో హెలికాప్టర్ టికెట్లు పెట్టిన కొన్ని నిమిషాల్లోనే అమ్ముడు పోతున్నాయి. కానీ ఈ హెలికాప్టర్ సర్వీసుల్లో సేఫ్టీ రూల్స్ పాటించడం లేదు. చిన్న చాపర్లలో ఎక్కువ మందిని ఎక్కిస్తున్నారు. 2 కిలోల కంటే ఎక్కువ లగేజీని అనుమతించబోమని టికెట్లలో పేర్కొంటున్నా.. ప్యాసింజర్లు ఎక్కే సమయంలో చెక్​ చేయట్లేదు. ఎంత లగేజీ ఉన్నా అనుమతిస్తున్నారు.

పెద్ద శబ్దం.. ఆపై మంటలు

‘‘ఆర్యన్ ఏవియేషన్ అనే సంస్థ ఆపరేట్ చేస్తున్న బెల్ 407 (వీటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎన్) హెలికాప్టర్ ఉదయం 11.45 గంటల సమయంలో కేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌ ఆలయం నుంచి గుప్త్‌‌‌‌‌‌‌‌కాశీకి యాత్రికులతో బయల్దేరింది. కొద్ది దూరం వెళ్లగానే గరుడ్ ఛట్టిలోని దేవ్ దర్శిణి వద్ద కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురూ అక్కడికక్కడే చనిపోయారు. హెలికాప్టర్ తునాతునకలైంది. హెలికాప్టర్ మంటల్లో చిక్కుకోవడానికి ముందు భారీ శబ్దం వచ్చినట్లు ఏవియేషన్ అధికారులు చెప్పారు. ఘటనాస్థలిలో పెద్ద ఎత్తున పొగ కమ్ముకుందని తెలిపారు. ఎన్‌‌‌‌‌‌‌‌డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్, ఎస్‌‌‌‌‌‌‌‌డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్ టీమ్స్, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. డెడ్‌‌‌‌‌‌‌‌బాడీలను కేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ హెలిప్యాడ్ వద్దకు తీసుకొచ్చారు.