దేశంలో వారం రోజులుగా ఒకటే హైటెన్షన్.. విమానాలకు వరస పెట్టి బాంబు బెదిరింపులు.. ఎంతలా అంటే.. జస్ట్ 72 గంటల్లో.. అంటే మూడు రోజుల్లో 20 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ విమానంలో బాంబు పెట్టాం.. ఆ విమానంలోని బాంబు కొద్దిసేపట్లో పేలుతుంది అంటూ ఫోన్ కాల్స్, మెయిల్ రావటం సంచలనంగా మారింది. దీంతో నాన్న పులి కథలా తయారైంది విమాన సంస్థల పరిస్థితి. ఫేక్ కాల్స్ అని లైట్ తీసుకుంటే.. ఆ తర్వాత అది నిజం అయితే పరిస్థితి ఏంటీ అనే ఆందోళన ఆయా విమాన సంస్థల నిర్వాహకుల్లో నెలకొంది.
మూడు రోజుల్లో ఏకంగా 20 విమానాలకు వచ్చిన అన్ని బెదిరింపు కాల్స్.. ఫేక్ అని తేల్చారు పోలీసులు. మూడు కాల్స్ ముంబై నుంచి వచ్చాయని.. ఆ ఫోన్ చేసింది ఓ బాలుడు అని నిర్థారించుకున్న పోలీసులు.. ఆ బాలుడిని అరెస్ట్ చేశారు.
విమానాలకు టార్గెట్ చేస్తూ.. బెదిరింపు కాల్స్, మెయిల్స్ చేస్తున్న వాళ్లను కఠినంగా శిక్షిస్తామని.. మిగతా వారిని సైతం వెంటనే గుర్తించి అరెస్ట్ చేస్తామని.. ఎవరూ ఎలాంటి భయాందోళనలు చెందొద్దు అని విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహననాయుడు ప్రకటించారు.
విమాన సర్వీసుల భద్రతపై రాజీలేదని.. సెక్యూరిటీ కట్టుదిట్టం చేశామని.. విమానం బయలుదేరే ముందే అన్ని రకాలుగా చెకింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి రామ్మోహననాయుడు. బెదిరింపు కాల్స్, భద్రత విషయాలపై 2024, అక్టోబర్ 17వ తేదీన ఢిల్లీలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, హోంశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కేంద్రం మంత్రి. ఫేక్ కాల్స్ చేసే వాళ్లను విమానం ఎక్కేందుకు శాశ్వతంగా నిషేధించాలనే సూచన చేశారాయన.
ఎయిర్ పోర్టుల భద్రత విషయంలో అన్ని దర్యాప్తు సంస్థలు సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు కేంద్ర మంత్రి రామ్మోహననాయుడు.