ఏపీలో 7 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో 7 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి: రాష్ట్రంలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు ఏపీ సిఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పివీ రమేష్. కరోనా వైరస్ పై యుద్ధానికి అందరూ సహకరిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. పోలీస్, డాక్టర్స్, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులకు సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారన్నారు. విదేశాల నుంచి 13వేల పైనే రాష్ట్రానికి వచ్చారని..ముఖ్యమంత్రి రోజుకు రెండు సార్లు కరోనాపై సమీక్షలు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో స్వయంగా వైద్య శాఖ మంత్రి పర్యటన చేస్తూ… పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారన్నారు. లక్ష N95 మాస్కులు అందుబాటులో ఉంచమని.. ప్రభుత్వం తరఫున కఠిన చర్యలు చేపట్టామన్నారు.  ఈ నెల 31వరకు ఇంట్లోనే ఉండాలని..ఇది సమాజానికి బాధ్యత అన్నారు. ఈ వైరస్ నివారణకు ముఖ్యముగా వ్యక్తిగత శుభ్రత, సోషల్ డిస్టన్స్ పాటించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని కించపరిచే విధంగా మాట్లాడవద్దని, ఎవరైనా జలుబు దగ్గుతో బాధపడుతుంటే 104కి కాల్ చేయాలని తెలిపారు.

విదేశాల నుంచి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని.. రోగ లక్షణాలు కలిగి ఉన్నవారు తక్షణం వైద్య ఆరోగ్యశాఖకు,  ప్రభుత్వ వైద్యులను, కాల్ సెంటర్ ను సంప్రదించాలని సూచించారు. జ్వరం, జలుబు, దగ్గు, శ్వాసలో ఇబ్బందులు ఉన్న వారు , వారితో పాటు తిరిగిన వారు కూడా సంప్రదించాల్సిందిగా కోరుతున్నామన్నారు. 60 ఏళ్ళు పై బడిన వారు, ధూమ, మద్య పానం ఎక్కువగా చేసిన వారికి ఎక్కువగా ఈ కరోనా వైరస్ ఎక్కువగా సోకే అవకాశం ఉందన్నారు.

అత్యవసర సేవల అందించే వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, విద్యుత్, మీడియా వారు మినహా ఎవరు బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. వచ్చిన వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని.. మార్కెట్ లో దొరికే సానిటైజర్లే అవసరం లేదని..సబ్బుతో కూడా 20 సెకంన్ల పాటు శుభ్ర పర్చుకోవచ్చన్నారు. జ్వరం వస్తే పారాసిట్మల్ 650 వేసుకోండని.. అయినా వారు ప్రభుత్వానికి మాత్రం తెలియచేయాలన్నారు. వీలైనంత మేర ఇంటిలోనే ఉండటం ద్వారా వైరస్ సంక్రమించకుండా చూడొచ్చన్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు తోపుడుబళ్ళ ద్వారా ఇంటివద్దకే అందించే ప్రయత్నం చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని పదే పే చెబుతున్నామన్నారు. రాష్ట్రంలో మందుల షాపుల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని.. మందులు రవాణా చేసే వాహనాలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్లోరోక్విన్ మందులు ఇష్టం వచ్చినట్టుగా వాడటం అనారోగ్యానికు దారితీస్తుందని చెప్పారు. హాస్టల్స్ లో విద్యార్థులు ఇంటికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామని.. కరోనా వైరస్ గాలితో వచ్చే వైరస్ కాదని.. వైరస్ సోకిన లక్షణాలు నెంటనే కనబడవన్నారు.

కొన్నిరకాల మందులు వేసుకుంటే తగ్గిపోతాయని ప్రచారం జరుగుతోందన్న ఆయన.. ఇలాంటి వదంతులు నమ్మవద్దని హెచ్చరించారు. హైడ్రో క్లోరోక్వీన్ వేసుకుంటే తగ్గుతుందని ఐసి ఎమ్మార్ చెప్పినప్పటికీ అది ప్రత్యేక పరిస్థితిలో మాత్రమేనన్నారు. తెలికుండా వేసుకున్న  వాటివల్ల లేనిపోని ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. నిత్యావసరాలు , కూరగాయలు ఎక్కువ సమయం అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామన్నారు. ప్రజలు వాళ్ళని వాళ్లు నియంత్రించుకుంటే వైరస్ ను నిరోధించవచ్చని తెలిపారు. అంతా కలిసి ఒక బయటి శత్రువును ఎదుర్కొంటున్నామని తెలిపారు పీవీ రమేష్.