సదువులకు దండిగా.. బడ్జెట్‌లో తొలిసారి విద్యారంగానికి 7 శాతం

సదువులకు దండిగా.. బడ్జెట్‌లో తొలిసారి విద్యారంగానికి 7 శాతం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం బడ్జెట్ లో విద్యారంగానికి ప్రాధాన్యం ఇచ్చింది. పోయినేడాదితో పోలిస్తే నిధులు పెంచింది. విద్యాశాఖకు మొత్తం రూ.21,292 కోట్లు కేటాయించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోయినేడు బడ్జెట్ లో విద్యాశాఖకు రూ.19,093 కోట్లు కేటాయించగా.. సర్కార్ ఇప్పుడు మరో రూ.2,199 కోట్లు ఎక్కువగా అలకేట్ చేసింది. దీంతో గత ఆరేండ్ల తర్వాత తొలిసారి బడ్జెట్ లో విద్యారంగానికి 7 శాతానికి పైగా నిధులు కేటాయింపు జరిగింది. రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసి.. సర్కార్ స్కూళ్లు, కాలేజీల్లో ప్రమాణాలు పెంచి, వసతులు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. విద్యాశాఖకు కేటాయించిన నిధుల్లో స్కూల్ ఎడ్యుకేషన్​ కు రూ.17,942 కోట్లు, హయ్యర్ ఎడ్యుకేషన్ కు రూ.3,350 కోట్లు ప్రతిపాదించింది. 

డిగ్రీ కాలేజీలకు 362 కోట్లు

స్కూల్ ఎడ్యుకేషన్ కు పోయినేడు రూ.16,092 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.17,942 కోట్లు కేటాయించారు. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ.14,665 కోట్లు, పరీక్షల విభాగానికి రూ.14.45 కోట్లు, అడల్ట్ ఎడ్యుకేషన్ కు రూ.9.51 కోట్లు, లైబ్రరీలకు రూ.85.23 కోట్లు, బాల భవన్ కు రూ.4.80 కోట్లు,  టెక్ట్స్ బుక్స్ ప్రెస్ కు రూ.46.29 కోట్లు, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీకి రూ.99.02 కోట్లు ప్రతిపాదించారు.

ఇక ప్రగతి పద్దు కింద రూ.925.73 కోట్లు, పరీక్షల విభాగానికి రూ.7.50 కోట్లు, సమగ్ర శిక్షకు రూ.1,952 కోట్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు రూ.82.06 కోట్లు , అడల్ట్ ఎడ్యుకేషన్​కు రూ.15.67 కోట్లు కేటాయించారు. మరోవైపు హయ్యర్ ఎడ్యుకేషన్ లో నిర్వహణ పద్దు కింద ఇంటర్ ఎడ్యుకేషన్ కు రూ.834.98 కోట్లు, కాలేజ్​ ఎడ్యుకేషన్ కు రూ.606.37 కోట్లు ప్రతిపాదించారు.

ఇందులో ఓయూకు రూ.492 కోట్లు, కేయూకు రూ.134.94 కోట్లు, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి రూ.17.95 కోట్లు, తెలంగాణ వర్సిటీకి రూ.42.09 కోట్లు, తెలుగు యూనివర్సిటీకి రూ.43.37 కోట్లు, మహాత్మాగాంధీ వర్సిటీకి రూ.30.77 కోట్లు, శాతవాహన వర్సిటీకి రూ.14.31 కోట్లు, పాలమూరుకు రూ.11.74 కోట్లు, జేఎన్టీయూహెచ్​కు రూ.52.69 కోట్లు, ఆర్జీయూకేటీకి రూ.35.64 కోట్లు, జేఎన్ఏ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీకి రూ.28.75 కోట్లు కేటాయించారు. సర్కార్ డిగ్రీ కాలేజీలకు రూ.362.85 కోట్లు అలకేట్ చేశారు. రూసా కింద రూ.105.27 కోట్లు ప్రతిపాదించారు.

కొత్త ఇంజినీరింగ్ కాలేజీలకు నిధులు

యూనివర్సిటీల్లో సౌలతుల కల్పనకు బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించారు. ఇందులో ఓయూకు రూ.100 కోట్లు, మహిళా వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించగా..  మిగిలిన వర్సిటీలన్నింటికీ కలిపి రూ.300 కోట్లు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఇంటర్నేషనల్ స్కూళ్ల కోసం రూ.500  కోట్లు, సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కు రూ.10 కోట్లు, తెలుగు అకాడమీకి రూ.17.26 కోట్లు కేటాయించారు.

ఇక కొత్తగా ప్రారంభించిన ఇంజినీరింగ్ కాలేజీలకు కూడా ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కరీంనగర్ లోని కాలేజీకి రూ.8.92 కోట్లు, జేఎన్టీయూ సుల్తాన్ పూర్ కు రూ.3.60 కోట్లు, జేఎన్టీయూ మంథనికి రూ.1.01 కోట్లు, జేఎన్టీయూ పాలేరుకు రూ.3 కోట్లు అలకేట్ చేసింది. కొత్తగా స్థాపించిన పాలిటెక్నిక్ లకు రూ.63 కోట్లు, పాత కాలేజీలకు రూ.229.24 కోట్లు ప్రతిపాదించింది.