కుంభమేళాకు వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్​.. ఏడుగురు మృతి

కుంభమేళాకు వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్​.. ఏడుగురు మృతి
  • చనిపోయినోళ్లంతా హైదరాబాద్ వాసులే.. మధ్యప్రదేశ్​లో ప్రమాదం

నాచారం/హైదరాబాద్, వెలుగు: మధ్యప్రదేశ్​లోని జబల్​పూర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్​కు చెందిన ఏడుగురు చనిపోయారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. వీళ్లు ప్రయాణిస్తున్న మినీ బస్సును సిమెంట్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు స్పాట్​లోనే చనిపోయారు. వీరిలో ఐదుగురు నాచారానికి చెందినవాళ్లు కాగా, ఒకరు దిల్​సుఖ్​నగర్, మరొకరు సరూర్​నగర్ వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు దగ్గర్లోని హాస్పిటల్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

నాచారం కార్తికేయనగర్ కు చెందిన నలుగురు ఫ్రెండ్స్, రాఘవేంద్రనగర్ కు చెందిన మరో నలుగురు, డ్రైవర్​తో కలిసి మినీ బస్సులో శనివారం కుంభమేళాకు వెళ్లారు. త్రివేణి సంగమంలో స్నానాలు చేసిన తర్వాత సోమవారం తెల్లవారుజామున అక్కడి నుంచి బయలుదేరారు. మధ్యప్రదేశ్​లోని జబల్​పూర్ జిల్లా కేంద్రానికి 65 కిలో మీటర్ల దూరంలో ఉన్న సిహోరా పట్టణ శివారుకు చేరుకున్నారు. రాంగ్ రూట్ లో ఓవర్ స్పీడ్​గా వచ్చిన సిమెంట్ లోడుతో ఉన్న ట్రక్కు.. వీరి బస్సును ఢీకొట్టింది. దీంతో మినీ బస్సు తుక్కుతుక్కయ్యింది.

ఈ ప్రమాదంలో నాచారం రాఘవేంద్రనగర్ కు చెందిన సోమవరపు శశికాంత్ (38), కార్తికేయనగర్ కు చెందిన రాంపల్లి రవికుమార్ (59), బోరంపేట సంతోష్ కుమార్ (46),  కార్తికేయనగర్ కాలనీ ప్రెసిడెంట్ మల్లారెడ్డి (60), నాచారంలోని ఎర్రకుంటకు చెందిన బస్సు డ్రైవర్ కమ్ ఓనర్ ఎర్రకుంట రాజు (38), దిల్​సుఖ్​నగర్​కు చెందిన గోల్కొండ ఆనంద్ కుమార్ (47), తార్నాక గోకుల్ నగర్ కు చెందిన టీవీ ప్రసాద్ (50) స్పాట్​లోనే చనిపోయారు. కార్తికేయనగర్​కు చెందిన శ్రీరామ్ బాలకృష్ణ (60), సరూర్ నగర్ కు చెందిన సుంకోజు నవీన్ చారి (52) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక దవాఖానలో చేర్పించి ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వివరాలు తెలుసుకున్న అక్కడి పోలీసులు.. హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇటీవలే సంతోష్ కుమార్ భార్య మృతి

కార్తికేయనగర్​కు చెందిన బౌరంపేట సంతోష్ కుమార్ కు 12 ఏండ్లలోపు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇతని భార్య ఇటీవలే కన్నుమూసింది. అలాగే, కార్తికేయ నగర్ కాలనీ అధ్యక్షుడు మల్లారెడ్డి.. జెర్సీ మిల్క్ డీలర్ గా ఉన్నాడు. ఇతనికి భార్య, కొడుకు ఉన్నాడు. తార్నాక గోకుల్ నగర్ కు చెందిన టీవీ ప్రసాద్.. తార్నాక బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్​లో లాజిస్టిక్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఇక, సోమవరపు శశికాంత్ సాఫ్ట్​వేర్ ఉద్యోగి. ఇతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. కార్తికేయ నగర్ కు చెందిన రాంపల్లి రవికుమార్ మెడికల్ షాప్ యజమాని. 

ఇతనికి కొడుకు, కూతురు ఉన్నారు. కాగా, కార్తికేయనగర్​లో ఉండే సంతోష్ కుమార్ తల్లి.. తన కొడుకు చనిపోయాడన్న వార్త విని కుప్పకూలింది. ‘‘నా కొడుకు నాతోని రోజూ మాట్లాడుతుండే. నిన్న కూడా ఫోన్ చేసిండు. అమ్మా మంచిగున్నవా.. టైంకు మందులేసుకో.. మంగళవారం రాత్రి వరకు వస్తా అని అన్నడు. అంతలోనే సచ్చిపోయిండని ఫోన్ చేసి చెప్పిన్రు. నాకు కాళ్లు చేతులు ఆడుతలేవు.. 
దేవుడా’’అంటూ కన్నీరుమున్నీరైంది.

అవసరమైన సహాయం చేయండి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

జబల్​పూర్ యాక్సిడెంట్​లో ఏడుగురు హైదరాబాద్ వాసులు చనిపోవడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ అధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని, గాయపడిన ఇద్దరికి మెరుగైన చికిత్స ఇప్పించాల్సిందిగా ఆదేశించారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌‌‌‌గిరి జిల్లాల కలెక్టర్లతోనూ మాట్లాడారు. ఆయా కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబసభ్యులనూ పరామర్శించారు.

మెరుగైన ట్రీట్​మెంట్ ఇవ్వండి: బండి సంజయ్

జబల్​పూర్ ఎస్పీ, కలెక్టర్​తో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్​లో మాట్లాడారు. గాయపడినవారికి మెరుగైన ట్రీట్​మెంట్ అందించాలని కోరారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహాలను వీలైనంత త్వరగా హైదరాబాద్​కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు ఎంపీ ఈటల రాజేందర్ సానుభూతి తెలియజేశారు. 

నేడు హైదరాబాద్​కు డెడ్ బాడీలు

ప్రమాదం గురించి తెలుసుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడారు. ఘటన గురించి తెలియజేసి.. డెడ్​బాడీలు తొందరగా హైదరాబాద్​కు పంపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం మృతదేహాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు బీజేపీ మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు భూపాల్​గౌడ్ తెలిపారు.