కైలాపూర్​లో 7 క్వింటాళ్ల మిర్చి చోరీ

చిట్యాల, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలం కైలాపూర్ గ్రామ శివారులో శనివారం రాత్రి  7 క్వింటాళ్ల ఎండుమిరపకాయలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం   గ్రామానికి చెందిన బూర్గుల రాయకోమురు, బోయిని సమ్మయ్య అనే ఇద్దరు రైతులు మిరపకాయలు ఏరిన అనంతరం కళ్లంలో ఆరబోశారు.

తాలు కాయలు సపరేట్ చేసి, మార్కెట్ కు తరలించేందుకు సిద్ధం చేశారు.  ఈ క్రమంలో  గుర్తు తెలియని వ్యక్తులు  రాయకోమురు కు చెందిన 5 క్వింటాళ్లు, సమ్మయ్య కు చెందిన 2 క్వింటాళ్ల మిర్చి ని దొంగిలించినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.