ఏడేళ్ల బాలుడు..మువ్వెన్నెల జెండాతో గుర్రపు స్వారీ

చారిత్రాత్మక నగరం ఓరుగల్లులో 76వ స్వాతంత్య్ర దినోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంబురాల్లో ఓ బుడతడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మువ్వెన్నెల జెండాతో హార్స్ రైడ్ చేస్తూ అందరిని అలరించాడు. వానను లెక్కచేయకుండా..గుర్రపు స్వారీ చేస్తూ..ఔరా అనిపించాడు. 

భయం లేదు..బెరుకు అంతకన్నా లేదు
వయస్సు ఏడేళ్లే..చదువుతుంది 2వ తరగతే. అయినా ఒంట్లో భయం లేదు..గుర్రం కాలు అంతలేకున్నా..గుర్రాన్నే కంట్రోల్ చేస్తున్నాడు మహ్మద్ అర్హమ్. హమకొండ జిల్లా ఒకటో డివిజన్ పలివెల్పుల గ్రామానికి చెందిన మహ్మద్ అర్హమ్..చిరు ప్రాయంలోనే తండ్రి దగ్గర గుర్రపు స్వారీలో రాటుదేలాడు. అయితే స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా గుర్రంపై తిరంగా ర్యాలీ నిర్వహించాలని భావించాడు. అంతే.. తన తెల్లని అశ్వంపై జాతీయ జెండాను పట్టుకుని సవారీ చేశాడు. చినుకులు పడుతున్నా..జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ..ఒంటి చేత్తో సవారీ చేసి..అందరి ప్రశంసలు అందుకున్నాడు. 

గుర్రం మీద స్వారీ చేయాలనేది కల..
మహ్మద్ అర్హమ్ తండ్రి పేరు మహ్మద్ అజ్గర్.  సౌదీ ఆరేబియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే అజ్గర్.. లాక్‌డౌన్ తరువాత ఉద్యోగం కోల్పోయాడు. ఆ తర్వాత సౌదీని వదిలి హనుమకొండ జిల్లా పలివేల్పులకు వచ్చేశాడు. అయితే రాజులా గుర్రం మీద తిరగాలనేది అజ్గర్ చిన్నప్పటి కల. అందుకోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ లో రూ. 81 వేలతో గుజరాత్ కు చెందిన మేలుజాతి తెల్లని అశ్వాన్ని కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా గుర్రంపైనే వెళ్తున్నాడు. తనకు తెలిసిన గుర్రపు స్వారీని కొడుకు అర్హమ్ కు నేర్పించాడు. అలా తండ్రి శిక్షణలో కేవలం 6 ఏళ్లకే గుర్రపు స్వారీలో అర్హమ్ రాటుదేలాడు. అజ్గర్ భార్య కూడా గుర్రపు స్వారీ చేయగలదు.

గుర్రం వారి కుటుంబంలో సభ్యుడు..
మహ్మద్ అజ్గర్ కుటుంబం ఆ గుర్రాన్ని తమ కుటుంబ  సభ్యుడి మాదిరిగానే చూసుకుంటున్నారు. గుర్రం పోషణకు  అజ్‌గర్ కుటుంబసభ్యులు నెలకు రూ. 6 నుంచి 8 వేలు ఖర్చు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకే కాదు..స్థానికులకు అజ్గర్ గుర్రపు స్వారీలో శిక్షణ ఇస్తున్నాడు.