ఈ చలికాలంలో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గి.. చలికి ఎక్కువైనా వణికిపోతాం.. బయటకు రావడానికి వెనుకాడతాం. అలాంటిది ఏడేళ్ల వయసులోనే ఎముకలు కొరికేసే చలిని సైతం లెక్క చేయకుండా ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన పర్వతం కిలిమంజారోను అధిరోహించాడు మన హైదరాబాదీ బుడ్డోడు. ఆ పసి వయసులోనే సాధించిన ఈ ఘనత తేలుకుంట విరాట్ చంద్రను గుర్తించిన భారత ప్రభుత్వం ఈ పిల్లాడిని 2022కు గానూ ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారానికి ఎంపిక చేసింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ విరాట్‌కు కంగ్రాట్స్ చెప్పారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Many congratulations to the young mountaineer Telukunta Virat Chandra for the Rashtriya Bal Puraskar. He climbed Mt. Kilimanjaro at such a young age! May he achieve even greater heights. Best wishes for his future endeavours. pic.twitter.com/7ZB83EyRXn
— Narendra Modi (@narendramodi) January 24, 2022
హైదరాబాద్‌కు చెందిన విరాట్ చంద్ర 2013 అక్టోబర్ 9న జన్మించాడు. ఈ బాలుడు ఏడేళ్ల వయసులోనే గత ఏడాది మార్చిలో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. ప్రతికూల వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా ఒక్క రోజులోనే ఉహురు పీక్‌కు చేరుకున్నాడు. తన కజిన్స్ ఇలానే పర్వతారోహణ చేశారని, వాళ్ల నుంచి స్ఫూర్తి పొంది కిలిమంజారో ఎక్కాలని నిర్ణయించుకున్నానని విరాట్ చెప్పాడు. ఈ విషయం పేరెంట్స్‌కి చెప్పానని, వాళ్లు ఒప్పుకోవడంతో శిక్షణ తీసుకుని ఈ ఫీట్ సాధించానని అన్నాడు.