70 కుటుంబాలను వెలేసిన్రు

మెట్ పల్లి, వెలుగు: ఐకేపీ కొనుగోలు కేంద్రంలో వడ్ల బస్తాకు ఒక్క రూపాయి చొప్పున ఇయ్యలేదని ఆగ్రహించిన వీడీసీ(విలేజ్ డెవలప్మెంట్ కమిటీ) మున్నూరు కాపు, గుడాటి కాపు సామాజికవర్గానికి చెందిన 70 కుటుంబాలను వెలి వేసిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం మెట్లచిట్టాపూర్ లో జరిగింది. మంగళవారం బాధితులు మెట్ పల్లి డీఎస్పీ ఆఫీస్, సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల వివరాల ప్రకారం.. మెట్ల చిట్టాపూర్ గ్రామంలో మూడు నెలల క్రితం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. కేంద్రంలో ధాన్యం అమ్ముకునే రైతులు 40 కిలోల సంచికి ఒక్క రూపాయి వీడీసీకి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. దానిని మున్నూరు కాపు, గుడాటి కాపు సంఘం సభ్యులు వ్యతిరేకించారు. ధాన్యం కొనుగోలు కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ద్వారా డబ్బులు జమ చేద్దామని చెప్పారు. దీనికి ఆగ్రహించిన వీడీసీ తమ ఆదేశాలు పాటించనివారిని సాంఘిక బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. డబ్బులు చెల్లించేందుకు రెండు సంఘాలు ససేమిరా అనడంతో మున్నూరు కాపు, గుడాటి కాపులకు చెందిన 70 కుటుంబాలను వెలి వేశారు. దీంతో బాధిత కుటుంబాలు రెండు నెలల క్రితం పోలీసులను ఆశ్రయించాయి. పోలీసులు వారిని పిలిపించి సమస్య సామరస్యంగా పరిష్కరించుకోవాలని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

సమస్య పరిష్కారం కాకపోగా ఆ తర్వాత నుంచి వేధింపులు పెరిగాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్నూరు కాపు, గుడాటి కాపుల ఇంట్లో జరిగే మంచి చెడులకు ఎవరూ వెళ్లరాదని, వారి బట్టలను రజకులు ఉతకరాదని, కటింగ్ చేయొద్దని, హోటల్లో చాయ్​ పోయొద్దని, కిరాణం సామాన్లు, పాలు, కూరగాయలు అమ్మవద్దని  ఇలా పలు ఆంక్షలు విధించారని వాపోతున్నారు. తమ వ్యవసాయ భూముల్లో ఎవరైనా పనులకు వచ్చినా, భూములను కౌలుకు తీసుకున్నా, ఇచ్చినా భారీ జరిమానా విధిస్తామని, తమతో మాట్లాడితే రూ.15 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారని బాధితులు చెప్పారు. వీడీసీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకొని గ్రామంలో సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు దేవేందర్, నర్సారెడ్డి, భూమన్న, స్వామి, శ్రీను, వెంకటరాజం, గంగాధర్, శ్రీను, అనిల్ మంగళవారం డీఎస్పీ రవీంద్రారెడ్డి, సబ్  కలెక్టర్ ఆఫీస్ ఏవో కు ఫిర్యాదు చేశారు.