ఏపీలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2944కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ లో వెల్లడించింది. గత 24 గంటల్లో 9504 శాంపిల్స్‌ని పరీక్షించగా 70 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది. ఇదే సమయంలో 55 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. గత 24 గంటల్లో ఎలాంటి మరణాలు నమోదు కాలేదని చెప్పింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2944 పాజిటివ్ కేసులకు గాను 2092 మంది డిశ్చార్జ్ అయ్యారని, 60 మంది మరణించారని తెలిపింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 792 మంది చికిత్స పొందుతున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో చిత్తూరు జిల్లాలో ముగ్గురు కోయంబేడు నుంచి వచ్చినవారని చెప్పింది.
విదేశాల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారిలో ఇప్పటి వరకు 111 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చివారిలో 406 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించగా.. ఇప్పటి వరకు 189 మంది డిశ్చార్జ్ అయ్యారని, మరో 217 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించింది.