హైదరాబాద్​ లోరోజుకు 70 మందికి కుక్క కాట్లు

  • రేబిస్​తో  నెలకు ఇద్దరు మృతి

సికింద్రాబాద్, వెలుగు: హైదరాబాద్​ సిటీలో వీధి కుక్కలు వెంటపడి కరుస్తుండగా..  కుక్క కాటుకు గురై రేబిస్ ​వ్యాధి చనిపోయేవారి సంఖ్య పెరుగుతోంది. దీనిపై బల్దియా చేప్టటే నివారణ చర్యలతో ఫలితం కనిపించడం లేదు. వీధుల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే వారిని, ఇంటి ముందు ఆడుకునే చిన్నారులను, బైక్ లపై వెళ్లేవారిని సైతం వదలవు. వెంటాడి మరీ కరుస్తున్నాయి.

దీంతో రోడ్డుపై ఒంటరిగా వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. సిటీలో ప్రతి రోజు సుమారు 70 మంది కుక్క కాటు బారిన పడుతుండగా.. తద్వారా రేబిస్ వ్యాధితో ప్రతి నెల ఇద్దరు వ్యక్తులు చనిపోతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.
 
 స్టెరిలైజ్ చేయనివి 90 వేలు 

ప్రస్తుతం సిటీలో వీధి కుక్కల సంఖ్య 3.97 లక్షలుగా ఉందని జీహెచ్​ఎంసీ లెక్కల ద్వారా తెలుస్తుంది. కుక్కల్లో సంతానోత్పత్తి నియంత్రణకు బల్దియా సిబ్బంది స్టెరిలైజేషన్ చేస్తుంటారు. ఇప్పటివరకు సుమారు 3 లక్షల  వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ ​చేయగా.. ఇంకా 90 వేల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి కుక్కలతోనే  బాధితులు కాటుకు గురై రేబిస్​తో చనిపోతున్నారు. 

ఏటేటా పెరుగుతున్న కేసులు 

కుక్క కాటు ఘటనలు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2022లో 19,847 నమోదైతే.. 2023లో 26,439 నమోదు అయ్యాయి. గత జనవరి  17 ఏప్రిల్​వరకు నాలుగు నెలల్లోనే  9,208 మంది కుక్క కాటు బారిన పడ్డారు. ఈ లెక్కన చూస్తే  ప్రతి ఏటా బాధితుల సంఖ్య పెరుగుతోంది. సిటీలో కుక్క కాటు బారినపడిన వారికి ప్రతినెలా 3 వేల నుంచి 4వేల యాంటి -రేబిస్​ వ్యాక్సిన్లు ఇస్తున్నారు. అయినా యావరేజ్ గా ప్రతి నెల ఇద్దరు రేబిస్​ వ్యాధితో చనిపోతున్నారు.

2019 నుంచి ఈ ఏడాది ఏప్రిల్​17 వరకు నమోదైన లెక్కల ప్రకారం చూస్తే.. 54 మంది రేబిస్​తో చనిపోయినట్టు మెడికల్ రికార్డుల ద్వారా తెలుస్తుంది. ఇందుకు ప్రధానకారణం రేబిస్ ​వ్యాధిపై అవగాహన లేకపోవడమేనని వైద్య నిపుణులు అంటున్నారు. కుక్కలు కరిచినపుడు వెంటనే వ్యాక్సిన్లు తీసుకోకపోవడంతోనే మరణాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. 

ఎండ వేడి..ఆకలి కారణంగానే.. 

కుక్కలు సాధారణంగా చలికాలంలో వాటి సంపర్క సమయంలోనే కోపంగా ఉంటూ మనుషులను కరుస్తుంటాయి.  వేసవిలో కూడా అవి విపరీతమైన కోపంగా, అగ్రెస్సివ్​గా ఉండటానికి ప్రధాన కారణం వేడిని, ఆకలిని తట్టుకోకపోవడమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.