నిర్మల్/లక్ష్మణచాంద : కాళేశ్వరంలో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని, కేసీఆర్ను మళ్లీ నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తారని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. సోమ, మంగళవారం నిర్మల్ పట్టణంతో పాటు లక్షణ చందా, మామడ మండలాల్లో ఆమె పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ఏ ఒక్క గ్రామం కూడా బాగుపడింది లేదన్నారు. సీఎం ఇంతవరకూ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ‘‘ఎన్నికలు వస్తేనే కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తడు. ప్రజల సమస్యలను ఆయన పట్టించుకోడు. ఇప్పుడు దళిత బంధు అంటున్నడు. రేపు ఎస్టీ బంధు, తర్వాత బీసీ బంధు అంటడు. కులాల మధ్య చిచ్చుపెట్టడమే ఆయన ధ్యేయం. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి తీసుకుపోయిండు” అని అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కు అమ్ముడుపోయి ప్రశ్నించడం మానేశారని విమర్శించారు. తెలంగాణను నట్టేట ముంచిన కేసీఆర్.. ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ పెట్టి ప్రధాని కావాలని పగటి కలలు కంటున్నారని ఫైరయ్యారు. రాష్ట్రంలో నిర్మించే అన్ని ప్రాజెక్టులను మేఘా కృష్ణారెడ్డి కంపెనీకే ఎందుకు అప్పజెప్తున్నారని ప్రశ్నించారు. ఆ కంపెనీ నుంచి బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కూడా వాటాలు వస్తున్నాయని, అందుకే ఆ రెండు పార్టీల నేతలు కేసీఆర్ అవినీతిపై నోరు మెదపడం లేదని ఆరోపించారు.