హైదరాబాద్, వెలుగు : స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రోత్సహించాలని సింగరేణి నిర్ణయించింది. కేంద్రం నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం, సత్యనారాయణ అన్ని ఏరియా జనరల్మేనేజర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆన్‌లైన్‌లో జరిగిన సమీక్షలో ఉద్యోగులు, పొరుగు సేవల సిబ్బందికి జాతీయ జెండాలను అందించేందుకు 70 వేల జాతీయ జెండాలను కొనుగోలు చేశామని డైరెక్టర్లు వెల్లడించారు.
ఈ నెల 10 నుంచి సింగరేణి వ్యాప్తంగా జెండాలు పంపిణీ చేయాలని ఏరియా జీఎంలను ఆదేశించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రతీ సిబ్బంది ఇళ్లపైనా జెండా ఎగరాలన్నారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రతిఒక్కరినీ భాగస్వాములను చేసేలా రక్త దాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సింగరేణి స్కూళ్లలో విద్యార్థులకు వ్యాస రచన, క్విజ్ పోటీలు పెట్టాలని, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలని సూచించారు.