హుజూరాబాద్‌‌‌‌లో కత్తులతో బెదిరించి దోపిడీ..70 తులాల బంగారం, రూ. 5 లక్షలు 

హుజూరాబాద్‌‌‌‌లో కత్తులతో బెదిరించి దోపిడీ..70 తులాల బంగారం, రూ. 5 లక్షలు 
  • కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా హుజూరాబాద్‌‌‌‌లో ఘటన

హుజూరాబాద్,​ వెలుగు : ఇంట్లో ఉన్న దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో బెదిరించి భారీ మొత్తంలో బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కరీంనగర్‌‌‌‌ జిల్లా హుజూరాబాద్‌‌‌‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని ప్రతాపవాడకు చెందిన రాఘవరెడ్డి ఇంట్లోకి ఆదివారం రాత్రి 11.30 గంటల టైంలో ముగ్గురు వ్యక్తులు చొరబడ్డారు. ఇంటి బయట ఉన్న బోర్‌‌‌‌ మోటార్‌‌‌‌ను ఆన్‌‌‌‌ చేసి, ట్యాప్స్‌‌‌‌ను ఓపెన్‌‌‌‌ చేశారు. బయట నీటి శబ్ధం వస్తుండడంతో రాఘవరెడ్డి, అతడి భార్య వినోద, కూతురు మానస నిద్ర నుంచి లేచి బయటకు వచ్చారు.

దీంతో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ముగ్గురిని కత్తులతో బెదిరించి ఇంట్లో ఉన్న 70 తులాల బంగారు నగలు, రూ.5 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో రాఘవరెడ్డికి అతడి భార్య వినోదకు గాయాలయ్యాయి. కొద్దిసేపటి తర్వాత సమీపంలోనే ఉన్న కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు వచ్చి ఇద్దరినీ హుజూరాబాద్‌‌‌‌ ఏరియా హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. సమాచారం అందుకున్న సీఐ తిరుమల్‌‌‌‌గౌడ్‌‌‌‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.

క్లూస్‌‌‌‌ టీమ్‌‌‌‌, డాగ్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌ను రప్పించి వివరాలు సేకరించారు. డాగ్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌ బాధితుడి ఇంటి ముందు నుంచి రంగనాయకుల గుట్ట వైపు వెళ్లింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌‌‌‌ సీఐ తిరుమల్‌‌‌‌గౌడ్‌‌‌‌ తెలిపారు. అయితే ఇటీవల హుజూరాబాద్‌‌‌‌ వచ్చిన రాఘవరెడ్డి కూతురు మానస ఒంటిపై ఉన్న బంగారం, ఆమె వెంట తెచ్చుకున్న నగదు గురించి తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.