ఒడిశాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధురాలు బ్యాంకు నుంచి పింఛను తీసుకోవడానికి చాలా కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చాలా బలహీనంగా ఉన్న ఓ వృద్ధురాలు.. విరిగిన కుర్చీ సాయంతో మండే వేడిలో చెప్పులు లేకుండా నడుస్తున్నట్లు ఈ వీడియోలో చూడవచ్చు. ఏప్రిల్ 17న ఒడిశాలోని నబ్రంగ్‌పూర్ జిల్లా ఝరిగావ్ బ్లాక్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
సూర్య హరిజన్ అనే వృద్ధురాలు చాలా పేదరాలు. ఆమె పెద్ద కొడుకు వేరే రాష్ట్రంలో వలస కూలీగా పనిచేస్తున్నాడు. ఆమె తన చిన్న కొడుకు అక్కడే కుటుంబంతో ఉంటున్నాడు. అతను పశువులను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. దున్నేందుకు భూమి కూడా లేకపోవడంతో ఆ కుటుంబం అక్కడే గుడిసె వేసుకుని జీవనం సాగిస్తోంది.
ఆ వ-ృద్ధురాలు పింఛను కోసం బ్యాంకు బాట పట్టింది. ఆమె బొటనవేలు రికార్డులకు సరిపోలడం లేదని అధికారులు చెప్పడంతో ఆమె తిరిగి ఇంటికి వచ్చింది. ఈ ఘటనపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మేనేజర్ స్పందిస్తూ, ఆమె వేళ్లు విరిగిపోవడంతో డబ్బును విత్‌డ్రా చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, సమస్యను పరిష్కరించడానికి బ్యాంక్ కృషి చేస్తోందని తెలిపారు.
ఆమె వేళ్లు విరిగిపోయాయి, కాబట్టి ఆమె డబ్బు విత్‌డ్రా చేయడంలో ఇబ్బంది పడుతోంది. దీంతో ఆమెకు బ్యాంక్ మాన్యువల్‌గా ₹ 3,000 అందించింది. తాము సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఝరిగావ్ బ్రాంచ్ SBI మేనేజర్ చెప్పారు. ఈ ఘటన అనంతరం ఆ గ్రామంలోని ఇలాంటి నిస్సహాయులను జాబితా చేసి వారికి పింఛన్ డబ్బులు అందించడంపై చర్చించినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు.