నా భూమిని ఇప్పించండి.. లేదా సూసైడ్​కు పర్మిషన్​ ఇయ్యండి?

ఖమ్మం టౌన్, వెలుగు: ‘నా భూమిని నాకు ఇప్పించండి. లేదంటే ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి’అని ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన గోగు వెంకటరామయ్య(70) సోమవారం వినూత్న నిరసనకు దిగాడు. ఓ రిటైర్డ్​తహసీల్దార్ తనను చంపాలని చూస్తున్నాడని ఆరోపించాడు. భూ సమస్యపై మొదట గ్రీవెన్స్​సెల్​లో కంప్లైంట్​చేసిన వెంకటరామయ్య తర్వాత జడ్పీ సెంటర్​లోని అంబేద్కర్​విగ్రహం వద్ద ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ నిరసనకు దిగాడు. ఖమ్మం సిటీలోని సర్వే నంబర్102లో ఉన్న తన భూమిని రిటైర్డ్ తహసీల్దార్ రావూరి వెంకటేశ్వర్లు, అతని భార్య మహేశ్వరి, ముక్క వీరయ్య చౌదరి, పెద్ది కేశవరావు అనే వ్యక్తులు ఆక్రమించుకుని తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించాడు. కబ్జా విషయమై త్రీటౌన్ పీఎస్, తహసీల్దార్​ఆఫీసుల్లో కంప్లైంట్​చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కలెక్టర్, సీపీలు పట్టించుకుని భూమిని తిరిగి ఇప్పించాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకునేందుకు పర్మిషన్​ ఇవ్వాలని కోరాడు.