ఆపై తొక్కి చంపిండు.. బీహార్‌లో ఘోరం
పాట్నా : బీహార్ లోని చంపారన్ జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. 70 ఏండ్ల పెద్దాయనను ఒకడు కారుతో స్పీడ్ గా ఢీకొట్టి 8 కిలోమీటర్లు ఈడ్చుకుపోయాడు. అనంతరం ఆ పెద్దాయనపై కారు పోనిచ్చి చంపేశాడు. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని నేషనల్ హైవే 27పై ఈ ఘోరం జరిగింది. మృతుడిని శంకర్ చౌధుర్ గా గుర్తించారు. ఆయన తన సైకిల్ పై హైవే దాటుతుండగా ఓ కారు అతివేగంగా శంకర్ ను ఢీకొట్టింది. దీంతో బాధితుడు ఎగిరి కారు బానెట్ పై పడిపోయాడు.
కింద పడకుండా ఉండేందుకు వైపర్ ను పట్టుకున్నాడు. అయినా కారు డ్రైవర్ వెహికల్ ను ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు. జనం అరుస్తున్నా, బాధితుడు మొరపెట్టుకుంటున్నా వినలేదు. కొంతమంది అతడిని ఆపేందుకు యత్నించారు. దీంతో అతడు ఇంకా వేగంగా డ్రైవ్ చేశాడు. కోత్వా ఏరియాలో సడెన్ గా బ్రేకులు వేయడంతో బానెట్‌పై ఉన్న శంకర్ కింద పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆయనపై నుంచి కారు నడుపుతూ వెళ్లాడు. సమా చారం అందుకున్న పోలీసులు ఎన్‌హెచ్ 27పై అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు. తర్వాత ఆ కారును సీజ్ చేశారు. అయితే డ్రైవర్ తో సహా కారులో ఉన్నోళ్లంతా అప్పటికే పారిపోయారు.