- కారులో పరారయ్యేందుకు యత్నిస్తుండగా పట్టుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది
- ఇద్దరు అరెస్ట్.. 700 గ్రాముల గోల్డ్ సీజ్
శంషాబాద్, వెలుగు : కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చిన ఓ ప్యాసింజర్ కారులో పారిపోయేందుకు ప్రయత్నించగా.. సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ చాంద్ పాషా అనే వ్యక్తి మంగళవారం కువైట్ నుంచి ఇండిగో ఫ్లైట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. చాంద్ పాషా అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
తనను అధికారులు పట్టకుంటారనే విషయాన్ని గమనించిన చాంద్ పాషా ఎయిర్ పోర్టు నుంచి తప్పించుకుని బయటికి వచ్చి కారులో పరారయ్యేందుకు యత్నించాడు. అలర్ట్ అయిన సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) సిబ్బంది వెంటనే ఆ కారును అడ్డుకున్నారు. చాంద్ పాషాతో పాటు కారు డ్రైవర్ మహ్మద్ ఆసిఫ్ ను అదుపులోకి తీసుకున్నారు.
ALSO READ:యువరాజ్ సింగ్ తల్లికి బెదిరింపులు.. మహిళ అరెస్టు
నిందితుడి నుంచి రూ.45 లక్షల విలువైన 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్యాసింజర్ పై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.