- తెలివిమీరిన సైబర్ నేరగాళ్లు
- డిజిటల్ అకౌంట్స్, క్రిప్టో ఆధారంగా విదేశాలకు సొత్తు
- నిరుడు రాష్ట్రవ్యాప్తంగా 65,877 మోసాలు
- రూ.707 కోట్లలో రూ.114 కోట్లే ఫ్రీజ్
- గోల్డెన్ అవర్స్‌లో 1930కి ఫిర్యాదు చేయాలని పోలీసుల సూచన
హైదరాబాద్, వెలుగు : సైబర్ నేరగాళ్లు తెలివి మీరుతున్నారు. ఆన్‌లైన్‌లో కొట్టేసిన సొమ్మును పోలీసులు ఫ్రీజ్ చేసేలోపే దేశాలు దాటిస్తున్నారు. పేమెంట్ గేట్‌వేస్, డిజిటల్ అకౌంట్స్, క్రిప్టో ఆధారంగా మనీ లాండరింగ్, వస్తువుల రూపంలో విదేశాలకు తరలిస్తున్నారు. బాధితులు 1930కి కాల్ చేసినా చాలా కేసుల్లో ఫలితం దక్కడం లేదు. ఇలాంటి కేసుల్లో నేరగాళ్లు చిక్కినా క్యాష్ రికవరీ మాత్రం కత్తిమీద సాములా మారింది. ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో 10 శాతం మాత్రమే రికవరీ అవుతున్నది.
ఇలాంటిదే నిరుడు రాష్ట్రవ్యాప్తంగా 65,877 ఫైనాన్సియల్ ఫ్రాడ్స్ జరగగా రూ.707 కోట్లను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. ఇందులో రూ.114 కోట్లు ఫ్రీజ్ చేయగా రూ.7.30 కోట్లు బాధితులకు రిఫండ్ అయ్యింది. సైబర్ నేరగాళ్లు ఇన్వెస్ట్‌మెంట్, ఆన్‌లైన్ ట్రేడింగ్స్ పేరుతో మోసాలకు పాల్పడతున్నారు. ముఖ్యంగా ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులను టార్గెట్ చేసి రూ.కోట్లు కొట్టేస్తున్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాల ఆశ చూపి అందినంత దోచేస్తున్నారు.
ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రాం అడ్డాగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివే ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్ట్ 10 వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో రూ.250 కోట్లు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. 1930కి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రూ.97.18 కోట్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఫ్రీజ్ చేశారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించి బాధితులకు డబ్బు రిఫండ్ చేశారు.
ఇంటర్నేషనల్ సైబర్ ముఠాల స్కెచ్
దుబాయి, కంబోడియా, థాయ్‌లాండ్, హాంకాంగ్ ప్రస్తుతం సైబర్ నేరగాళ్లకు అడ్డాలుగా మారాయి. ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ నంబర్స్ కోసం నేరస్తులు ప్రత్యేక నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. చైనీయులు రూపొందించిన యాప్స్‌తో వరుస మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌లో కొట్టేసిన డబ్బును క్రిప్టో కరెన్సీ రూపంలో దేశం దాటిస్తున్నారు. వస్తువులు కొనుగోలు చేసి సొంత దేశాల్లోని కుటుంబ సభ్యులకు ఎగుమతి చేస్తున్నారు. దేశంలోనే ఉండి సైబర్ నేరాలకు పాల్పడుతున్న నైజీరియన్లు.. ఢిల్లీ, ముంబై, సూరత్ లాంటి ప్రాంతాల్లో హోల్‌సేల్‌గా బట్టలు కొనుగోలు చేస్తున్నారు. వాటిని షిప్ యార్డ్‌ల నుంచి కన్‌సైన్‌మెంట్ పార్సిల్ రూపంలో నైజీరియాకు తరలిస్తున్నారు. స్థానిక హోల్‌సేల్ మార్కెట్లలో ఆ సరుకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
కంపెనీల పేరుతో కరెంట్ అకౌంట్స్
ఆన్‌లైన్ అడ్డాగా సాగుతున్న ఇలాంటి నేరాల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోతోంది. ఇందుకు కారణం గోల్డెన్ అవర్స్‌లో బాధితులు 1930కి కాల్ చేయకపోవడం సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారింది. దోచుకున్న సొమ్ము పోలీసులకు చిక్కకుండా సైబర్ నేరస్తులు జాగ్రత్త పడుతున్నారు. ఫేక్ ఫోన్ నంబర్లు, ఫేక్ బ్యాంకు ఖాతాలతో పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. లోకల్ ఏజెంట్స్, కంపెనీల పేరుతో కరెంట్ అకౌంట్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దోచుకున్న డబ్బును డిజిటల్, వర్చువల్ ఖాతాలతో ఖాళీ చేస్తున్నారు. దీంతో ఏజెంట్లు అరెస్ట్ అవుతున్నారు తప్ప అసలు నేరస్తుల జాడ లభించిడం లేదు.