గద్వాల, వెలుగు : ఖరీఫ్ లో వరి కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో పంట కొనుగోలుపై మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో 71 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని దాదాపు 2, 45 వేల మెట్రిక్ టన్నుల వరి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం ఏ గ్రేడ్ కి రూ. 2060, సాధారణ రకానికి రూ. 2040 ధర ఉంటుందన్నారు. కొనుగోలు కేంద్రాలకు కావలసిన టార్పాలిన్లు, వేయింగ్ మిషన్లను సిద్ధం చేయాలన్నారు. ఖరీఫ్ లో పంట కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మీటింగ్ లో జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గోవింద్ నాయక్, డి.ఎస్.పి రంగస్వామి, మార్కెటింగ్ ఆఫీసర్ పుష్ప తదితరులు పాల్గొన్నారు.
పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించాలి
పిల్లలకు ధనుర్వాతం, కోరింత దగ్గు రాకుండా వ్యాక్సినేషన్ వేయించాలని కలెక్టర్ ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో డీఈవో, డీ ఎం అండ్ హెచ్ ఓ మీటింగ్ నిర్వహించారు. ఐదు నుంచి పదవ తరగతి చదువుతున్న పిల్లల లిస్టును రెడీ చేయాలని, ఈనెల ఏడో తేదీ నుంచి 19వ తేదీ వరకు టీడీ వాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలో 21, 250 మంది పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించేలా ప్లాన్ చేసు కోవాలన్నారు. అనంతరం గవర్నమెంట్ కాలేజీ ల ప్రిన్సిపల్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కేజీబీవీ కాలేజీల ప్రిన్సిపల్స్ తో మీటింగ్ నిర్వహించారు. ఇంటర్మీడియట్ ఇంటర్ స్టూడెంట్స్ 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని, మెయిన్ ఎగ్జామ్స్ కు ఇప్పటినుంచే పిల్లలను రెడీ చేయాలన్నారు. అందుకోసం ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేయాలన్నారు.
బాడీని వెలికి తీసి పోస్ట్‌మార్టం
నవాబుపేట, వెలుగు: మండలంలోని మరికల్ గ్రామ పంచాయతీ పరిధిలోని అంతంపల్లి వార్డు మెంబర్ ఇండ్ల నర్సిములు (58) గత నెల 15న చనిపోవడంతో కుటుంబసభ్యులు అంత్యక్రియ లను నిర్వహించి డెడ్‌బాడీని పొలంలో పూడ్చారు. కాగా మృతుడి అల్లుడు యన్మన్గండ్ల గ్రామానికి చెందిన కొనింటి బాలయ్య తన మామ మరణంపై అనుమానాలు ఉన్నాయని, విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అక్టోబర్ 17న జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకోగా జిల్లా వైద్య సిబ్బంది మృతుడి గ్రామానికి చేరుకుని డెడ్‌బాడీని వెలికితీసి, పోస్ట్‌మార్టం నిర్వహించారు. రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై పురుషోత్తం తెలిపారు.
సదరం క్యాంపులో ఎవరైనా డబ్బులు అడిగితే కేసులే
- ప్రధాన ఆస్పత్రిలో నెలకోసారి దివ్యాంగుల కోసం ప్రత్యేక ఓపీ
- దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణిలో కలెక్టర్ ఎస్.వెంకట్ రావు
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం ఆయన రెవెన్యూ మీటింగ్ హాలులో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సదరం పత్రాలు పొందేందుకు శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. వాటికోసం మధ్యవర్తులు డబ్బులు అడిగితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో అధికారిక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏలాంటి సమస్యలైనా వారు ఈ కమిటీ ముందుకు తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. నిరుద్యోగులైన దివ్యాంగుల కోసం ప్రత్యేకించి ఒక కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేసి 3 నెలల డిప్లమో కోర్స్ ని నిర్వహిస్తామని , ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో నెలకొకసారి దివ్యాంగుల కోసం ప్రత్యేక ఓపీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దివ్యాంగులకు మహబూబ్ నగర్ తో పాటు, జడ్చర్లలో ప్రత్యేకంగా మూడు మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ రామ్ కిషన్, ఇంచార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ శశికాంత్, డి ఆర్ డి ఓ యాదయ్య, జిల్లా సంక్షేమ అధికారి జరిన బేగం తదితరులు మాట్లాడారు .
రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు
భూత్పూర్, వెలుగు: మండలంలోని పోల్కంపల్లి హైవే స్టేజీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అన్నసాగర్ గ్రామానికి చెందిన గొడుగు చెన్నకేశవులు బైక్ పై పొలానికి వెళ్తు పోల్కంపల్లి స్టేజీ వద్ద రోడ్డును దాటుతుండగా, వెనకపైపు నుంచి వచ్చిన డీసీఎం ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కేసు నమోదు చేసినట్లు భూత్పూర్ పోలీసులు తెలిపారు.
మైనర్ నడుపుతున్న బైక్ ఢీకొని..
అడ్డాకుల,వెలుగు : మండలకేంద్రంలో ఓ మైనర్ బైక్ డ్రైవింగ్ తో ప్రమాదం జరిగి ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. మండల కేంద్రానికి చెందిన నీలమ్మ, లక్ష్మమ్మ సర్వీస్ రోడ్డు వెంట వెళ్తుండగా కాటవరం గ్రామానికి చెందిన ఓ మైనర్ మండల కేంద్రానికి వస్తూ.. ఈ ఇద్దరి మహిళలను ఢీ కొట్టాడు. దీంతో మహిళలకు గాయాలుకాగా.. స్థానికులు 108అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. లక్ష్మమ్మకు తలకు బలమైన గాయమైందని నీళ్ళమ్మకు నడుముకు గాయమైందని డాక్టర్ తెలిపారు.