ఈమె స్టీరింగ్‌‌ కానీ పట్టిందంటే..

ఆడవాళ్లు ఏపనైనా చేయబోతే ‘నీవల్ల కాదు. వదిలెయ్‌‌. నువ్వు చేయలేవు’ అని అనేవాళ్లు ఎక్కువ ఈ సొసైటీలో. జీవితంలో అలాంటి మాటలను ఎన్నో విన్న డెబ్బైయ్యొక్కేండ్ల బామ్మ.. తన వల్ల కాదు అన్న పనిని పట్టుపట్టి నేర్చుకుంది. ‘చేయలేవు. నీ వల్ల కాదు’ అన్న మాటల మీద గెలిచింది.

కేరళలోని తొప్పుంపాడిలో ఉంటుంది రాధామణి. ఆమెను ‘మణి అమ్మ’ అని పిలుస్తారు అక్కడివాళ్లు. ఆడవాళ్ల కంటే మగవాళ్లే మంచి డ్రైవర్స్ అని అంటుంటారు. అలా అన్నవాళ్లకు బుద్ధి చెప్పాలని 11 రకాల కేటగిరీల్లో హెవీ వెహికల్స్ డ్రైవింగ్‌‌ నేర్చుకుంది. అంతేకాదు డ్రైవింగ్ లైసెన్స్, వర్క్‌‌ పర్మిట్‌‌ తీసుకుని డ్రైవింగ్‌‌ కూడా నేర్పిస్తున్న రాధామణి గురించి...

డ్రైవింగ్ అలా మొదలైంది
రాధామణి టీనేజ్‌‌ నుండే ఒక్కసారైనా కార్‌‌‌‌ డ్రైవింగ్‌‌ చేయాలని కలలు కనేది. తన కలలకు తగ్గట్టుగానే భర్త లలన్‌‌ ‘ఎ2జెడ్‌‌ ఇన్‌‌స్టిట్యూషన్‌‌ ఆఫ్‌‌ హెవీ ఎక్విప్‌‌మెంట్‌‌’ అనే పేరుతో డ్రైవింగ్‌‌ స్కూల్‌‌ నడిపేవాడు. దాంతో ‘డ్రైవింగ్‌‌ కల నెరవేర్చుకోవచ్చు’ అనుకునేది రాధామణి. కానీ ఆమె అత్తామామలు ‘అమ్మాయి డ్రైవింగ్ చేయడమేంటి? చుట్టు పక్కల వాళ్లు చూస్తే ఏమనుకుంటారు’ అని రాధామణిని ఆపేవాళ్లు. కొన్ని రోజులు మౌనంగా ఉన్నా ఊరుకోలేదు. పట్టుపట్టి భర్తను డ్రైవింగ్‌‌ నేర్పించమని అడిగేది. ఎలాగోలా తన 30 ఏండ్ల వయసులో కారు‌‌ నడపడం నేర్చుకుంది. లైసెన్స్‌‌ కూడా తీసుకుంది. అప్పటినుండి ఆమె కూడా లలన్‌‌తో కలిసి అప్పుడప్పుడు డ్రైవింగ్‌‌ క్లాస్‌‌లు చెప్పేది. 

1988లో మొదటి సారి ఎమర్జెన్సీ అవసరం పడి తొప్పుంపాడి నుండి చెర్తాల వరకు దాదాపు 50 కిలోమీటర్లు బస్సుకూడా నడిపింది. ఎంత దూరమైనా నడిపే ధైర్యం ఉందని అప్పుడే అర్థమైంది రాధామణికి. భర్త సాయంతో బస్‌‌, ట్రక్‌‌ డ్రైవింగ్‌‌ పూర్తిగా నేర్చుకుని లైసెన్స్ తీసుకుంది. 2004 లో లలన్‌‌ చనిపోయాడు. ‘ఇక డ్రైవింగ్ స్కూల్ ఎవరు నడిపిస్తారు?’ అని అందరూ అనుకుంటుంటే రాధామణి మాత్రం‘ఎవరో ఎందుకు నేనే నడిపిస్తా’ అని ముందుకొచ్చింది. ‘నువ్వా? నీకేం వచ్చు. స్టీరింగ్‌‌ అంటే ఏంటో తెలుసా?’ అని చుట్టు పక్కల వాళ్లు ఎగతాళి చేశారు. అప్పుడే డిసైడ్‌‌ అయింది ‘ఎలాగైనా వాళ్ల మాటలకు తన పనితో సమాధానం చెప్పాలని.’ అందుకే ఎక్స్‌‌కవేటర్‌‌‌‌, క్రేన్‌‌, జెసిబి, రోడ్‌‌ రోలర్‌‌‌‌, బుల్డోజర్‌‌‌‌ ఇలా ఏ బండిని వదలకుండా అన్నింటి డ్రైవింగ్‌‌ నేర్చుకుంది. లైసెన్స్ తీసుకుంది. అంతేకాదు కేరళలో డ్రైవింగ్‌‌ స్కూల్స్‌‌ సంఖ్యను 10 బ్రాంచ్‌‌ల వరకు పెంచింది. దాంతో ఇప్పుడు అది కేరళలో అతి పెద్ద మోటార్ డ్రైవింగ్‌‌ స్కూల్‌‌గా గుర్తింపు కూడా తెచ్చుకుంది.