
Karnataka Water: ప్రస్తుతం కర్ణాటకలో అధికారులు ప్యాకేజ్డ్ నీళ్ల బాటిళ్ల శాంపిల్స్ పరిశీలించగా షాకింగ్ విషయం బయటకు వచ్చింది. మెుత్తం 296 బాటిళ్లలో కేవలం 95 మాత్రమే తాగదగిన క్వాలిటీ కలిగి ఉన్నట్లు సంచలన నివేదికను ఆరోగ్య కుటుంబ సంరక్షణ మంత్రి దినేష్ గుండు రావు వెల్లడించారు. అంటే మార్కెట్లో దొరుకుతున్న దాదాపు 72 శాతం సరకు నాణ్యతా ప్రమాణాలకు లోబడి లేవని స్టడీలో వెల్లడైంది. వీటిలో చాలా శాంపిల్స్ తాగటానికి పనికిరానివిగా, నాణ్యతా ప్రమాణాలకు సరిపోలనివిగా ఉన్నాయని తేలింది.
ఫుడ్ సేఫ్టీ అధికారులు దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని దినేష్ పేర్కొన్నారు. నీటి శాంపిళ్లలో తాము రసాయనాల అవశేషాలు, ఫ్లోరైడ్, క్యాలిష్యం, మెగ్నీషియం వంటివి గుర్తించినట్లు వెల్లడించారు. ఇక్కడ స్టడీలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనేక బ్రాండ్లు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని, స్థానికంగా లోకల్ ఉత్పత్తిదారుల బాటిళ్లలో మాత్రం నాణ్యత కొరవడిందని వెల్లడించారు. ఈ దశలో మొత్తం కంపెనీలను లక్ష్యంగా చేసుకోవడం కంటే బ్యాచ్ స్థాయిలో చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
ప్రస్తుతం తాము సర్వే శాంపిళ్లను మాత్రమే తీసుకున్నామని, లీగల్ శాంపిల్స్ వచ్చిన తర్వాత ప్రమాణాలను పాటించని సంస్థలపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. తమకు ప్రజల ఆరోగ్యమే మెుదటి ప్రాధాన్యతగా దినేష్ వెల్లడించారు.
Also Read : ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
ఇదే క్రమంలో మార్కెట్ నుంచి సేకరించిన 115 ప్రైడ్ గ్రీన్ బఠాణీ శాంపిళ్లలో 70 శాతం ఫుడ్ కలర్స్ కలిపినవి ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే హోటళ్ల తనిఖీలో పెస్ట్ కంట్రోల్ రూల్స్ పాటించని 214 సంస్థలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో 11 హోటళ్లపై జరిమానాలు విధించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం మార్కెట్లో పెద్ద బ్రాండ్లకు అత్యంత దగ్గరగా పోలి ఉండే నకిలీల్లో ఎక్కువగా నాణ్యత కొరవడినట్లు అధికారులు గుర్తిస్తున్నారు. పైగా ఇలాంటి వాటర్ బాటిళ్లలో అధిక స్థాయిల్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఇలాంటి కారణాల వల్ల ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ప్యాకేజ్డ్ వాటర్ ను డిసెంబర్ 2024 నుంచి హై రిస్క్ ఫుడ్ కేటగిరీ కిందకు మార్చింది. అందుకే మార్కెట్లో వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసే విషయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ నాణ్యతకలిగిన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.