మొ బైల్ ఫోన్‌ను పబ్లిక్ గీ రేంజ్లో వాడుతరని యాభై ఏండ్ల కింద దీన్ని కనిపెట్టినప్పుడు(1973) తాను అస్సలు ఊహించలేదని మొబైల్ ఫోన్ సృష్టికర్త మార్టిన్ కూపర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిండు. గిప్పుడు పబ్లిక్ మొబైల్ ఫోన్లు వాడుతున్న తీరు జూసి.. తానే షాక్ అవుతున్నాననీ అన్నడు. నిజంగనే గిప్పుడు మొబైల్ లేకుంటే ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితికొచ్చిన్రు జనం. పొద్దుగల లేసినప్పటి సంది మాపటీల పడుకునేదాకా.. ఫోన్ ఇడిస్తే.. పానం ఇడిసినట్లు జేస్తున్నరు. గంతెందుకు.. పండుకునే టైంల గూడా ఫోన్ పక్కనే పెట్టుకుంటున్నరు. మధ్యల మేలుకొచ్చినప్పుడు జరంత సేపు ఫోన్జూసుకుని మళ్లా కండ్లు మూస్కుంటున్నరు. నిజానికి ఇయ్యాల స్మార్ట్ ఫోన్లే మన ప్రపంచంగా మారిపోయినయి. ఇతరులతో కనెక్ట్ కావాలన్నా, వ్యక్తిగతంగా, జాబ్ పరంగా, ఎంటర్ టైన్మెంట్ కోసం ఇవే ఇంపార్టెంట్ అయినయి. అందుకే సడెన్ గా ఫోన్లు ఆఫ్ అయిపోతే ఇవన్నీ మిస్ అయిపోతామని పబ్లిక్కు మస్త్ బుగులైతంది. బ్యాటరీ అయిపోతుందంటే చాలు.. ఫోన్ స్విచాఫ్ అయితదేమోనని బగ్గ టెన్షన్ పడుతున్నరు.
సర్వేల ఏం తేలిందంటే..
మన దేశంల ఎంత మంది నోమోఫోబియాతోటి టెన్షన్ పడుతున్నరో తెలుసుకుందమని చైనా ఫోన్ ల కంపెనీ ఒప్పో, కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ కలిసి గీ నడ్మ సర్వే జేసినయి. దేశంలోని కొన్ని పెద్ద సిటీల్లోని 1500 మందిని ఇంటర్వ్యూ చేసి, ఇవరాలు సేకరించినయి. దీంతో బ్యాటరీ చార్జింగ్ అయిపోతుంటే.. 65% మంది స్మార్ట్ ఫోన్ యూజర్లు పరేషాన్ అవుతున్నరని, యాంగ్జైటీకి గురవుతున్నరని, దునియా నుంచి దూరమైనట్లు, హెల్ప్‌లెస్‌గా, అన్ సెక్యూర్డ్‌గా అయిపోయినట్లు ఫీలవుతున్నరని తేలింది. చాలా మంది ఫోన్ ఆగిపోతే ఏదో పోగొట్టుకున్నట్ల బుగులు పడుతున్నరని, గీ మాత్రం దానికే నిరాశతో కుంగిపోతున్నరని వెల్లడైంది. గందుకే బ్యాటరీ చార్జింగ్ జల్దీ దిగిపోతున్నదన్న కారణంతోటే 60% మంది పాత ఫోన్లు పక్కన పడేసి కొత్త ఫోన్లు కొంటున్నరని సర్వేల తేలింది. ఇగ ఫోన్ల గురించి ఆడోళ్ల కంటే మొగోళ్లే ఎక్కువగా బుగులు పడుతున్నరట. మొగోళ్లలో 82% యూజర్లు టెన్షన్ పడుతుండగా.. ఆడవాళ్లలో మాత్రం కొంచెం తక్కువగా 74% మంది చింతజేస్తున్నరని సర్వేల బయటవడ్డది. గట్లనే ఫోన్ బ్యాటరీ అయిపోతుందేమోనన్న బుగులుతో ఏకంగా 92.5 శాతం మంది పవర్ సేవింగ్ మోడ్‌ను చాల్ జేసి పెట్టుకుంటున్నరట. చార్జింగ్ ఎక్కుతుండగానే 87 శాతం మంది ఫోన్లను వాడుతున్నరట. అయితే, లో బ్యాటరీ యాంగ్జైటీ అనేది 31 నుంచి 40 ఏండ్ల మధ్య ఉన్నోళ్లలోనే, అది గూడా వర్కింగ్ గ్రూప్ వారిలోనే ఎక్కువగా ఉన్నదట. ఇగ వీళ్ల తర్వాత 25 నుంచి 30 ఏండ్ల మధ్య వాళ్లే ఫోన్ల గురించి ఎక్కువగా ఫికర్ జేస్తున్నరని తేలింది.
బ్రిటన్ వాళ్ల దగ్గర మొదలు..
నోమోఫోబియా ఉన్నోళ్లకు అనవసరంగా టెన్షన్ పడుడు, చెమటలు పట్టుడు, పెయ్యి వణుకుడు, చివరకు శ్వాస తీసుకోవడంల ఇబ్బందులు గూడా వస్తున్నయని ఎక్స్ పర్ట్లు చెప్తున్నరు. నిజానికి ఇదేం కొత్త ముచ్చట గాదు. నోమోఫోబియా సంగతిని బ్రిటన్ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది 2008లో జరిపిన స్టడీ సందర్భంగానే గుర్తించిన్రు. జనాన్ని మొబైల్ ఫోన్లకు దూరం చేస్తే వాళ్ల ఫీలింగ్స్ ఎలా ఉంటాయన్నదే ఆ స్టడీ. అప్పట్లోనే దాదాపు 50% మందికిపైగా పార్టిసిపెంట్లు మొబైల్ లేకుంటే టెన్షన్ పడుతున్నరని, స్ట్రెస్ ఫీలవుతున్నరని తేలింది. దీంతో ఈ సమస్యకు నోమోఫోబియా అని వాళ్లు పేరు పెట్టారు.
ఆఖరు ముచ్చట
గిప్పుడు దినాం అన్ని పనులకూ స్మార్ట్ ఫోన్ల మీదనే ఆధారపడుతున్న పబ్లిక్.. అవి లేకుంటే ఎట్ల ఫీలవుతున్నరు? బ్యాటరీ ఫాస్ట్‌గా అయిపోయే ఫోన్లు వాడుతున్నోళ్ల పరిస్థితి ఏంది? అన్నది తెలుసుకునేందుకని ఈ సర్వే చేసినమని ఒప్పో కంపెనీ ప్రతినిధులు చెప్తున్నరు. ఈ సర్వేలో తెలిసిన విషయాలతోటి తమ ఫోన్లను మరింత మంచిగ తయారుజేసేందుకు వీలవుతున్నదని అంటున్నరు. బ్యాటరీ ఇంకా ఎక్కువ సేపు వచ్చే ఫోన్లు కావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నరని ఈ సర్వేల తెలుసుకున్నమని, గందుకే.. ఫోన్లు కొనేటోళ్లకు లో బ్యాటరీ యాంగ్జైటీ సమస్యను తగ్గించేందుకని రూ. 24,999 రేట్‌తో ‘ఒప్పో ఎఫ్23’ పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేశామని చెప్తున్నరు. అయితే.. సర్వే చేసిన తర్వాత ఐడియా ఫ్లాష్ అయ్యి.. గీ కొత్త ఫోన్‌ను రిలీజ్ చేసిండ్రా..? లేదంటే గీ కొత్త ఫోన్‌ను రిలీజ్ జేసుకుని, యాపారం బగ్గ జేసుకునేటందుకే గీ సర్వే జేసి, లెక్కలు పబ్లిక్ లోకి వదిలిండ్రా? అన్నది మాత్రం మనకు తెల్వద్.
75% మందికి నోమోఫోబియా
స్మార్ట్ ఫోన్ తోటి మస్త్ లాభాలున్నయ్. గట్లనే నష్టాలు గూడా ఉన్నయని మనందరికీ ఎరికే. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే వెలుతురుతోటి కండ్లు దెబ్బతింటున్నయ్. చూపు తగ్గిపోతున్నది. ఊకే ఫోన్ జూస్తూ ఉండటంతోటి మెడలు పట్టేస్తున్నయి. పెయ్యి కదలకుండా అట్లనే పడుకునుడో లేదా కూసునుడు వల్ల ఇన్ డైరెక్ట్ గా పెయిల ఎన్నో సమస్యలు మోపైతున్నయి. అయితే, బ్యాటరీ అయిపోతుంటే ఫోన్ స్విచాఫ్ అయితదేమో.. సిగ్నల్స్ దొరకకపోతే ఫోన్ ల నెట్ రాదేమో.. అని ఉత్తగనే బుగులు పడుడుతోటి గూడా చాలామందిలో ఒక ఫోబియాలాగా మారిపోయి హెల్త్ కరాబ్ అయితున్నదట. దీన్నే నోమోఫోబియా అంటారట. నోమోఫోబియా అంటే.. నో మొబైల్ ఫోన్ ఫోబియా అన్నమాట. మన దేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురికి ఈ ఫోబియా ఉన్నదట. అంటే స్మార్ట్ ఫోన్ లు వాడుతున్నోళ్లలో 75% మంది ఈ ఫోబియాతో బుగులుపడుతున్నరని ఒప్పో, కౌంటర్ పాయింట్ సర్వేల తేలింది.
- హన్మిరెడ్డి యెద్దుల సీనియర్ జర్నలిస్ట్