- ఇప్పటికే రూ. 36 వేల కోట్లు చేరవేత.. మరో రెండు నెలల్లో 39 వేల కోట్లు
- రూరల్ ఎకానమీకి ఊతమిచ్చేలా రాష్ట్ర సర్కారు నిర్ణయాలు
- ఫ్రీ జర్నీ మొదలు పంట రుణమాఫీ దాకా..!
- గ్రామీణ ప్రజలకు అండగా పథకాల అమలు
- మహిళా సంఘాలకు భారీగా నిధులు
- వచ్చే ఫుల్ బడ్జెట్లోనూ పల్లెలకు ప్రయారిటీ
- గ్రామాల్లో పెరుగుతున్న నగదు ఫ్లో
- ఇది మంచి పరిణామం అంటున్న ఆర్థిక రంగ నిపుణులు
- యాసంగి రైతుబంధు కింద రూ.7 వేల కోట్లు
- చేనేత కార్మికులకు పెండింగ్ బకాయిలు రూ.50 కోట్లు
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద రూ. 2 వేల కోట్లు
- గృహజ్యోతి పథకం కింద రూ. 1,500 కోట్లు
- రుణమాఫీ కింద రూ. 6 వేల కోట్లు (మరో ఇరవై రోజుల్లో ఇంకో 25వేల కోట్లు)
- మహిళ సంఘాలకు రూ.350 కోట్లు
హైదరాబాద్, వెలుగు : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా పల్లెల్లోకి నగదును పంపింగ్ చేస్తున్నది. అర్హులకే స్కీమ్‌ల ద్వారా క్యాష్ చేరేలా చూస్తున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దగ్గరి నుంచి మొదలు.. పంట రుణాల మాఫీ వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములన్నీ రూరల్ ఎకనామీకి బూస్టప్‌గా మారుతున్నాయి. ఇటీవల సర్కార్ నిర్వహించిన ఇంటర్నల్ సర్వేలోనూ ఇదే విషయం తేలింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరేడు నెలల్లోనే ఇప్పటి వరకు రూ. 36 వేల కోట్ల మేర నిధులు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చేరాయి. రానున్న రెండు మూడు నెలల్లో ఇంకో రూ.39 వేల కోట్లు చేరవేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే ఏకంగా రూ. 75 వేల కోట్ల నిధులు నేరుగా పల్లెలకు చేరుతుండటంతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతుల్లో సరికొత్త మార్పులు వస్తాయని ఆర్థికవేత్తలు అంటున్నారు.
సమాంతరంగా రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధి చెందుతుందని పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్కీములను డీబీటీ మోడ్‌లో అమలు చేస్తున్నది. దీంతో పల్లె జనాల్లో నగదు అందుబాటులో ఉంటున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి యాసంగి రైతుబంధును ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ మొత్తం రూ.7 వేల కోట్లు. దాదాపు 65 లక్షల మంది రైతులకు అందజేసింది. ఆ తర్వాత చేనేత కార్మికులకు పెండింగ్ బకాయిలు రూ.50 కోట్లు చెల్లించింది.
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. టికెట్‌కు డబ్బులు చెల్లించాల్సి అవసరం లేకపోవడంతో ఆ డబ్బును మహిళలకు ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటున్నట్లు, పొదుపు చేసుకుంటున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైంది. ఇప్పటి వరకు ఫ్రీ బస్సు జర్నీ కింద రూ. 2 వేల కోట్ల మేర మహిళలకు లబ్ధి చేకూరింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు కరెంట్ కూడా ఉచితం కావడంతో గ్రామాల్లో అలా ఆదా అయ్యే డబ్బును జనం నిత్యావసరాలకు వాడుకుంటున్నట్లు ప్రభుత్వ సర్వేలో తేలింది.
ఇది ప్రతినెలా యావరేజ్‌గా రూ.200 కోట్లు కాగా.. ఇప్పటి వరకు ప్రజలకు రూ. 1,500 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఆసరా పెన్షన్ల కింద ప్రభుత్వం ప్రతినెలా రూ.1,000 కోట్లు చెల్లిస్తుండగా.. ఇప్పటి వరకు రూ. 8 వేల కోట్ల 40 లక్షల పైచిలుకు లబ్ధిదారుల చేతికి వెళ్లాయి. ఇక, రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ కింద ప్రభుత్వం ఈ నెల 18న రూ. లక్ష మాఫీ చేసింది. ఈ నెలాఖరులో రూ. లక్షన్నర, పంద్రాగస్టులోపు రూ. రెండు లక్షల రుణాలు మాఫీ చేయనుంది. అంటే నెల రోజుల్లోనే రూ.31 వేల కోట్లు నేరుగా రైతులకు ఇస్తున్నది.
ఇప్పటికే ఇందులో ఆరు వేల కోట్లు రైతులకు చెల్లించింది. ఇంకో 20 రోజుల్లో 25 వేల కోట్లు ఇవ్వనుంది. అదే సమయంలో పంట పెట్టుబడి సాయం కింద ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు భరోసా కింద సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇంకో రూ.7 వేల కోట్లు ఇవ్వనుంది. పెరిగిన పెన్షన్లను పూర్తిస్థాయి బడ్జెట్ తర్వాత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో ఇప్పుడు వృద్ధులు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు అందుతున్న ఆసరా పెన్షన్డబ్బులు చేయూత కింద మరింత పెరగనున్నాయి. ఈ మొత్తం కూడా ప్రభుత్వం క్యాష్ రూపంలోనే ఇస్తున్నందున గ్రామాల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
మహిళ సంఘాలకు ప్రభుత్వం రూ.350 కోట్లు రిలీజ్ చేసింది. స్టూడెంట్లకు పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా రిలీజ్ చేసేందుకు సర్కార్ రెడీ అయింది. ఇవి కూడా వచ్చే రెండు మూడు నెలల్లో విడతల వారీగా ఇవ్వనుంది. ఈ మొత్తం కూడా రూ. 4 వేల కోట్లపైనే ఉన్నది. ఇవికాకుండా పెండింగ్ సీఎంఆర్ఎఫ్ బకాయిలు ఇవ్వడం, ఇతర సంక్షేమ పథకాలతోనూ ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి నగదును జమ చేస్తున్నది.
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం వెంటనే రైతులకు డబ్బులు రిలీజ్ చేసింది. ఇది ప్రభుత్వం ఇచ్చేది కాకపోయినా ఆలస్యం చేయకుండా రిలీజ్ చేయడంతో రైతులకు రూ. 10 వేల కోట్లు చేరాయి. వచ్చే ఫుల్ బడ్జెట్లోనూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పలు నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది.
పెరుగనున్న కొనుగోలు శక్తి
సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతి రూపాయి తదనంతరకాలంలో సగటున 18 రెట్ల ప్రయోజనాలను అందిస్తుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఖర్చులు ఎకనామీ ఎకో సిస్టమ్‌ను చైన్‌లా రన్ చేస్తాయని.. రూరల్ కొనుగోలు శక్తి పెరిగితేనే.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలంగా తయారవుతుందని పేర్కొంటున్నారు.
ప్రభు త్వం మధ్యలో ఎవరి పెత్తనం పెట్టకుండా నేరుగా నగదు బదిలీ చేయడంతో పేదలు ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకుంటున్నారని అంటున్నారు. నగదు ఫ్లో పెరగడంతో గ్రామీణ ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం.. దానికి సమాంతరంగా రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధి చెందుతుందని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా టైమ్‌కు శాలరీలు రిలీజ్ చేయడం కూడా ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని అంటున్నారు.