డెబ్బై ఐదేండ్ల క్రితం ఇదే రోజున అంటే 1948 జనవరి1న మన దేశంలో ఆదివాసీలపై జరిగిన హత్యాకాండ ఫలితంగా ఆదివాసీలకు నూతన సంవత్సర వేడుకలు లేవు. జార్ఖండ్ లోని ఖర్సావాన్ లో రాణి దుర్గావతి ఆడిటోరియంలో ఆదివాసీల అమరవీరులకు ఏటా జనవరి1న ఆదివాసీలు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఆనాటి పాలకుల నుంచి నేటి పాలకుల వరకు ఆదివాసీల మీద జలియన్ వాలాబాగ్ ని మించిన ఊచకోత లెన్నో జరుగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న గిరిజనులు స్వయంపాలనతో కూడిన ప్రత్యేక ప్రాంతం కావాలని చేసిన పోరాటంలో సుమారు30 వేల మంది గిరిజనులు ఆత్మార్పణం చెందారు. 1948, జనవరి 1న స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో బీహార్( నేటి జార్ఖండ్) లోని ఖర్సావాన్ ను ఒడిశాలో విలీనం చేయడాన్ని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించారు.
గిరిజనులు అధికంగా ఉండే ఖర్సావాన్ ను బీహార్ లోనే చేర్చాలని ఆదివాసీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 50 వేల మంది గిరిజనులు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. వారి డిమాండ్ ను ఒప్పుకోని అప్పటి ప్రభుత్వం ఆదివాసీలపై మిలిటరీ ఫోర్స్‌ను దింపింది. గుమికూడిన వారిపై మిలిటరీ పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో సుమారు 30వేల మంది గిరిజనులు మరణించారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఆ సంఘటనతో జనవరి1అంటేనే గిరిజనులు చాలా కాలం వణికిపోయారు. అందుకే గిరిజన సంఘాలు, జైస్ సంగతన్ ఈ తేదీని ఆదివాసీ అమరవీరుల దినోత్సవంగా ప్రకటించాయి. దీనిపై సమగ్ర నివేదికను రాజ్యాంగ పరిషత్ సభ్యుడు జైపాల్ సింగ్ ముండా డ్రాప్టింగ్ కమిటీకి అందజేశారు. ఈ సంఘటన జరిగి 75 ఏండ్లు అయినా, తమ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి కోసం ఆదివాసీలు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు.
- గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక