భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం జరిగిందే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. కడవెండి గ్రామంలో మొదలైన ఈ తిరుగుబాటు ఆ తర్వాత తెలంగాణవ్యాప్తంగా విస్తరించింది. ప్రజలను కట్టు బానిసలను చేసిన దేశ్‌ముఖ్‌ల కర్కశత్వం, నిజాం నిరంకుశత్వంపై కడవెండి గ్రామం కన్నెర్ర చేసింది. వీరుల్లో విప్లవ జ్వాలలు రగిలించి అగ్నికణికగా మారింది. భూస్వాములు, జమీందార్లు, జాగీర్దార్లు, పెత్తందారుల దాష్టీకాలను ఎదిరించి.. తెలంగాణ పల్లె పడుచులను చెరబట్టిన రజాకార్లు, దేశ్‌ముఖ్‌లు, దొరలు, వారి గూండాల గుండెల్లో బడిసెలు దించింది. ఇక్కడ మొదలైన పోరాటాలే స్ఫూర్తిగా నిజాం రక్కసుల గుండెల్లో తూటాలై పేలాయి. 1946 జులై 4న కడవెండి తిరుగుబాటులో తొలి అమరుడయ్యారు దొడ్డి కొమురయ్య. తెలంగాణ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన ఈ ఘటన జరిగి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా కడవెండి అమరులను స్మరించుకుందాం.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికింది కడవెండి గ్రామం. నాటి నల్గొండ జిల్లా, నేటి జనగామ జిల్లా దేవరుప్పల మండలం కడవెండి గ్రామంలో 1946 జులై 4న విస్నూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటే తెలంగాణ రైతాంగాన్ని పోరు బాట పట్టించింది. ఈ ఘటనలో దేశ్‌ముఖ్ గూండాలు, రజాకార్ల తుపాకీ తూటాలకు గుతుపల(దుడ్డుకర్ర) సంఘం నాయకుడు దొడ్డి కొమురయ్య బలవడంతో అప్పటి వరకు శాంతియుతంగా జరిగిన ప్రజా పోరాటం కాస్తా తిరుగుబాటుగా మారింది. వెల్లువెత్తిన ప్రజాగ్రహం విప్లవంగా మారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి దారి తీసింది. కడవెండికి చెందిన ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, నల్ల నర్సింహులు, దొడ్డి కొమురయ్య, దొడ్డి మల్లయ్య వంటి ఎందరో నాయకులు తొలితరం ఉద్యమకారులను అందించగా, నక్సల్బరీ ఉద్యమం వరకు కడవెండి ఎందరో విప్లవ వీరులను అందించింది. కడవెండి వీరుల ధీరత్వానికి స్ఫూర్తిని పొంది ఎందరో యోధులు తెలంగాణ ప్రజల దాస్య శృంఖలాల విముక్తి కోసం పోరాడారు. నాడు దేశ్‌ముఖ్‌ల దొరతనాన్ని ఎదిరించిన ఈ గ్రామం తెలంగాణలో జరిగిన ప్రతి ఉద్యమానికీ ఊపిరులూదింది.
నాయకత్వాన్ని మట్టుబెట్టే పన్నాగం..
కడవెండి ప్రజల్లో చైతన్యం నింపుతున్న సంఘాన్ని, దాని నాయకత్వాన్ని మట్టుబెట్టాలని విస్నూర్ దేశ్‌ముఖ్ కుట్ర పన్నాడు. పట్టుకోల్పోతున్న గ్రామంలో సంఘం లీడర్లను చంపడం ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలనే కుయుక్తితో దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి ముష్కర మూకలను రంగంలోకి దింపాడు. ఈ క్రమంలో విస్నూరు నుంచి తన అనుచరుడు మిస్కిన్ అలీ, గడ్డం నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన గూండాలు, హైదరాబాద్ నుంచి వచ్చిన రజాకార్లను బందూకులతో కడవెండిలోని తన గడీ పక్కనున్న భవనంలో దింపాడు. ఆ రాత్రి వాళ్లంతా మద్యం తాగి అకృత్యాలకు తెగబడ్డారు.
కడవెండిలో కదిలిన ర్యాలీ..
సంఘం కార్యాలయంలో సమావేశమైన లీడర్లకు ముష్కర దాడుల సమాచారం అందింది. గ్రామంలో ర్యాలీ తీసి దేశ్‌ముఖ్‌కు బుద్ధి చెబుదాం.. అవసరమైతే తాడో పేడో తేల్చుకోవాలని సంఘం లీడర్లు నిర్ణయించుకున్నారు. సంఘం నేతల సారథ్యంలో 1946 జులై 4 రాత్రి 7 గంటల తర్వాత కార్యకర్తలు.. కాగడాలు, గుతుపలు(దుడ్డుకర్రలు) పట్టుకుని సంఘం కార్యాలయం నుంచి గడీవైపు ర్యాలీగా బయలు దేరారు. ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, దావిద్‌రెడ్డి, దొడ్డి మల్లయ్య సారథ్యంలో వందలాది మంది కార్యకర్తలతో సంఘం ర్యాలీ మొదలైంది. గుతుపల సంఘం నాయకుడు దొడ్డి కొమురయ్య యువకులతో ర్యాలీ ముందు భాగంలో నడుస్తుండగా కార్యకర్తలు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఊరేగింపుగా బయలు దేరారు. దీంతో గ్రామమంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ముష్కర మూక కాల్పులకు బలైన దొడ్డి కొమురయ్య
ఆగ్రహావేశాలతో వస్తున్న ప్రజాదండును చూసి ముష్కర మూక వెన్నులో వణుకు పుట్టింది. నాయకులు, కార్యకర్తలతో ఐక్యంగా గడీవైపు దూసుకొస్తున్న వారు చేసిన నినాదాలతో గ్రామం దద్దరిల్లింది. ర్యాలీ గడీ ముందుకు రాగానే అక్కడే పొంచి ఉన్న ముష్కర మూకలు ఒక్కసారిగా విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాయి. తుపాకీ గుండ్ల వర్షంతో ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. తూపాకీ తూటాలు తాకిన వారి ఆర్తనాదాలు, పొలికేకలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ర్యాలీలో ముందు ఉన్న దొడ్డి కొమురయ్య పొట్టలోకి తూటాలు దూసుకుపోయి పేగులు తెగిపడ్డాయి. రక్తపుమడుగులో కొమురయ్య నేలకొరిగాడు. పక్కనే ఉన్న దొడ్డి మల్లయ్య రెండు మోకాళ్లలోకి తూటాలు దిగి నెత్తురు చిందింది. ఈ కాల్పుల్లో దేశపల్లి(మంగలి) కొండయ్య నుదుటన బుల్లెట్ గాయాలయ్యాయి. కొండయ్య సోదరుడు దేశపల్లి నర్సయ్య చేతికి గాయమైంది. కొంగళ్ల సాయిలు, దొడ్డి బయ్యాలు, దూడల సాలమ్మ తీవ్రంగా గాయపడ్డారు. అయినా ప్రజలు భయపడక తిరగబడడంతో ముష్కర మూకలు పారిపోయి దొర గడీలో దాక్కున్నాయి. కొమురయ్య మరణించడంతో కార్యకర్తలు ఆగ్రహంతో దేశ్‌ముఖ్ గడీని చుట్టుముట్టారు. విషయం దావాలనంలా వ్యాపించడంతో చుట్టున్న గ్రామాలు సీతారాంపురం, దేవురుప్పల, మాధవాపురం, నిర్మాల, మడిపడగ, కామారెడ్డిగూడెం నుంచి రెండు వేలకు పైగా ప్రజలు ఘటనా స్థలానికి తరలివచ్చారు. జనాలు వరిగడ్డితో గడీని కాల్చేందుకు ప్రయత్నించారు. కానీ, స్థానిక ఆర్గనైజర్ ఆజ్ఞ మేరకు దాడులు విరమించుకున్నరు. ఆ రాత్రి ఊరంతా నిద్రలేని రాత్రిని గడిపింది.
ముష్కర మూకలపై దాడి..
మరుసటి రోజు కడవెండి కదనరంగమైంది. చుట్టు పక్కల ఉన్న గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కడవెండి చేరుకున్నారు. గడీ దిగ్భందంలో ఉన్న గూండాలు, ముష్కర మూకలను విడిపించేందుకు విస్నూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి రెండో కొడుకు బాబుదొర(జగన్మోహన్రెడ్డి) 200 మంది సాయుధ గూండాలతో కడవెండి తరలి వస్తుండగా ఆగ్రహంతో ఉన్న ప్రజలు తిరగబడ్డారు. రౌడీలు తుపాకీ కాల్పులు జరిపినా వడిసెల రాళ్లతో కారంపొడులతో మహిళలు, యువకులు వారిని తరిమికొట్టారు. గూండాల తుపాకులు లాక్కుని విరిచేశారు. దీంతో భయకంపితుడైన దేశ్‌ముఖ్ కొడుకు గాలిలో కాల్పులు జరుపుకుంటూ పారిపోయాడు. కార్యకర్తలు, ప్రజలు దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. గ్రామస్తులు దేశ్‌ముఖ్ అనుచరుడు అనుమాల రాంరెడ్డిని కొట్టి కసి తీర్చుకున్నారు.
కడవెండి పోరాట ఫలితం..
కడవెండి ఘటన జరిగిన రెండు నెలలకే ఉద్యమ తీవ్రత పెరిగి తెలంగాణ ప్రాంతం అంతటికీ విస్తరించింది. నిజాం సంస్థానం ప్రజా పోరాటాలతో అట్టుడికింది. దీంతో అప్పటి నిజాం ప్రభుత్వం ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించింది. 1951 అక్టోబర్ 21 వరకు తెలంగాణలో పోరాటాన్ని రహస్య దళాల ఏర్పాటు ద్వారా సాయుధ పోరాట రూపంలో కొనసాగించారు. ప్రతి పల్లెపై పోలీసు దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. పల్లెలన్నీ విప్లవ బడబాగ్నిగా మారి భగ్గున మండాయి. ప్రతి గ్రామంలో గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసి ప్రజలను సాయుధ విప్లవంవైపు సమీకరించారు. రజాకార్లు, పోలీసుల దాడుల్లో దాదాపు 4,000 మంది మరణించారు. ఎంతో మంది గాయపడ్డారు.
రైతాంగ సాయుధ పోరాటాలతో ఎట్టకేలకు స్పందించిన భారత ప్రభుత్వం.. నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో కలపడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అప్పటి ఉప ప్రధాని, హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఆదేశం మేరకు 1948 సెప్టెంబర్‌లో జనరల్ చౌదరీ నేతృత్వంలో భారత సైనిక బలగాలు చుట్టుముట్టాయి. మునగాల, కోదాడ మీదుగా, మరోవైపు జాల్నా, ఔరంగాబాద్ మీదుగా నిజాం రాజ్యంలోకి భారత సైనిక దళాలు చొచ్చుకొచ్చాయి. సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు సైనిక చర్య నిర్వహించింది. సెప్టెంబర్ 17న నిజాం భారత సేనలకు లొంగిపోవడంతో తెలంగాణ ప్రాంత ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. కడవెండిలో మొదలైన పోరాటాల ఫలితంగా 3,000 గ్రామాల్లో వెట్టి చాకిరి విధానం రద్దయ్యింది. దున్నేవాడికే భూమి అన్న నినాదం కల సాకారమై 10 లక్షల ఎకరాల భూపంపిణీ జరిగింది.
- మరిపాల శ్రీనివాస్
ఉద్యమానికి ఊపిర్లూదిన వీరుని మరణం
దొడ్డి కొమురయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జనగామ దవాఖానకు తరలించారు. శవ పరీక్ష తర్వాత జనగామకు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అడుగడుగునా కొమురయ్యకు జోహార్లు పలికారు. ఉద్రిక్తతల నడుమ అంత్యక్రియలు నిర్వహించి దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రతినబూని నివాళులర్పించారు. దొడ్డి కొమురయ్య మరణం ప్రళయమై రైతాంగ తిరుగుబాటుకు దారి తీసింది. ప్రజా పోరాటం మలుపు తిరిగి సాయుధ రైతాంగ పోరాటంగా మారింది. వెట్టి చాకిరి, కట్టు బానిసత్వాన్ని ధిక్కరించారు. పురుషులతో పాటు స్త్రీలు కూడా పోరాటంలో కీలకపాత్ర పోషించారు. కవులు, కళాకారులు, మేధావులు, విద్యావంతులు సంఘటితమయ్యారు. కొమురయ్య బలిదానం విప్లవ సాహిత్యానికి తొలి అక్షరమైంది. సభలు, సమావేశాల్లో కొమురయ్య మీద పాడిన పాటలు ఉద్యమ కొలిమిని రగిలించాయి.
కడవెండిలో ఉద్భవించిన సంఘం..
విస్నూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి దాష్టీకాలకు ఎదురొడ్డి పోరాడడానికి కడవెండి గ్రామంలో సంఘం ఏర్పాటైంది. రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ దాష్టీకాలకు ఎదురు తిరిగిన దొడ్డి మల్లయ్య ఆధ్వర్యంలో నల్ల నర్సింహులు, దావిద్‌రెడ్డి, మచ్చ రామయ్య, మచ్చ సత్తయ్య, మాచర్ల కొండయ్యలతో 1944లో ఆంధ్ర మహాసభ గ్రామ కమిటీ ఏర్పాటైంది. యువకులను సంఘటితం చేసి గొడ్డళ్లు, బడిసెలు, దుడ్డుకర్రలను ఆయుధాలుగా చేసుకున్న గుతుపల సంఘానికి దొడ్డి కొమురయ్య నాయకత్వం వహించాడు. కొడవళ్లు, కారంపొడిలో ఇసుక కలిపి మహిళలు సంఘం పోరాటాలకు సిద్ధమయ్యారు. దేశ్‌ముఖ్ అకృత్యాలపై తిరగబడేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్న కడవెండి ప్రజలకు సంఘం ఆయుధంగా మారింది. దేశ్‌ముఖ్ అక్రమంగా ఆక్రమించిన పేదల భూములను తిరిగి చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. దినదినంగా సంఘం కార్యకలాపాలు పెరిగిపోవడంతో దేశ్‌ముఖ్ గుండెల్లో గుబులు మొదలైంది
మరిపాల శ్రీనివాస్