- పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు
- చెదురుముదురు సంఘటనలు మినహా సజావుగా పోలింగ్
నల్గొండ / సూర్యాపేట / యాదాద్రి వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పలుచోట్ల పో లింగ్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంలో ఈవీఎంలు మోరాయించాయి. దీంతో పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. మిర్యాలగూడ, కో దాడ, హుజూర్నగర్, ఆలేరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. డబ్బులు పంచుతున్నారని, పోలింగ్ కేంద్రాల్లో పార్టీ కండువాలు కప్పుకుని వచ్చారని ఇరు పార్టీల ఏజెంట్లు అభ్యంతరం చెప్పడంతో గొడవలు జరిగాయి.
మధ్యాహ్నం నుంచే ఊపందుకున్న పోలింగ్..
ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా, చలికాలం కావడంతో పొద్దున్నే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయారు. పైగా పలుచోట్ల డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామని ఓటర్లు పట్టుబట్టడంతో గ్రామాల్లో, పట్టణాల్లో పోలింగ్ఆలస్యంగా మొదలైంది. నల్గొండ జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 75.24 శాతం పోలింగ్ నమో దైంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 22.74 శాతం నమోదు కాగా, మళ్లీ మధ్యాహ్నం 1 గంట వరకు 39.2శాతం మాత్రమే పోలింగ్ జరిగింది.
తిరిగి 2 గంటల తర్వాత నుంచి ఓటర్లు కేంద్రాలకు రావడం మొదలు పెట్టారు. దీంతో 3 గంటలకు పోలింగ్ పర్సంటేజీ 59.98 శాతానికి పెరిగింది. 3 నుంచి 5 గంటల వ్యవధిలో పోలింగ్ 75.24 శాతానికి చేరింది. 5 గంటల తర్వాత కూడా ఓటర్లు క్యూలో నిలబడడంతో రాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. యావరేజ్ 85.49 శాతంకాగా జిల్లాలో దాదాపు 85.49 శాతం పోలింగ్ నమోదయింది. నకిరేకల్ నియోజకవర్గంలో 86.67 శాతం నమోదు కాగా, మిర్యాలగూడలో 83.47 శాతం నమో దైంది. నాగార్జున సాగర్లో 85.58 శాతం నమోదైంది. మునుగోడులో 91.51 శాతం, దేవరకొండలో 83.95శాతం, నల్గొండలో 81.05 శాతం పోలింగ్ నమోదైంది.
సూర్యాపేట జిల్లాలో
సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు 74.88 శాతం పోలింగ్ నమోదైంది. హుజూర్నగర్లో 74.11 శాతం, కోదాడలో 77.41 శాతం, సూర్యాపేటలో 72.45 శాతం, తుంగతుర్తిలో 75.54 శాతం పోలింగ్ నమోదైంది. యాదాద్రి జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు భువనగిరిలో 81.04 శా తం పోలింగ్ నమోదుకాగా, ఆలేరులో 75.78 శాతం నమోదైంది.
యాదాద్రి జిల్లాలో...
ఆలేరు నియోకవర్గంలోని కొలనుపాకలోని పోలింగ్ స్టేషన్ కు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత తరపున ఏజెంట్ గా ఉన్న ఆమె భర్త గొంగిడి మహేందర్రెడ్డి రావడంతో కాంగ్రెస్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు పార్టీల క్యాడర్ మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సమయంలోనే మహేందర్రెడ్డి కారుపైకి రాళ్లు విసరడంతో అద్దం పగిలింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేటలో రెండు పార్టీల మధ్య గొడవ జరగడంతో పోలీసులు
పరిస్థితిని చక్కదిద్దారు.
డబ్బుల కోసం నిలదీసిన ఓటర్లు
ఓట్లకు డబ్బులు ఇవ్వడం లేదంటూ ఓటర్లు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులు కొంతమందికే డబ్బులు పంచడంతో తమకెందుకు ఇవ్వరని నాయకులను నిలదీశారు. 22వ వార్డ్ కు చెందిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఓటర్లకు డబ్బులు పంచకపోవడంతో ఇంటి ముందు ఆందోళన చేసేందుకు బయలు దేరిన వారిని మధ్యలోనే ఆపి డబ్బులు పంచడంతో వెళ్లిపోయారు. ఆత్మకూర్(ఎస్) మండలంలోని బూట్యా తండలో అధికార పార్టీ నాయకులు డబ్బులు పంచకపోవడంతో ఇంటి ముందు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నాయకుడికి గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది.