ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 75వ స్వాతంత్ర్య సంబరాలు అంబరాన్నంటాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆఫీసుల్లో జాతీయ జెండాలు ఎగురవేసి గౌరవ వందనం చేశారు.
- నెట్వర్క్, వెలుగు
సింగరేణి పరిసర ప్రాంతాల అభివృద్ధికి కృషి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి పరిసర ప్రాంతాల అభివృద్ధికి 2015–22 వరకు వివిధ ప్రభుత్వ శాఖలకు రూ. 3,650 కోట్లు చెల్లించామని సింగరేణి కాలరీస్ డైరెక్టర్ ఎస్. చంద్రశేఖర్ చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో సింగరేణి హెడ్ఆఫీస్ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు సీఎస్ఆర్కింద రూ. 230 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ ఫైనాన్షియల్ఇయర్లో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. 2029–30 నాటికి సింగరేణి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వచ్చే ఐదేండ్లలో మరో పది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. మరో మూడేండ్లలో 1200 మెగావాట్ల ప్లాంట్‌కు అదనంగా మరో 800 మెగావాట్ల ప్లాంటును కూడా నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 36శాతం వృద్ధి సాధించామన్నారు. అనంతరం సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల నుంచి ఎంపిక చేసిన ఉత్తమ కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కంపెనీ డైరెక్టర్లు ఎన్. బలరాం, సత్యనారాయణ, జీఎంలు కె. బసవయ్య, ఎ. ఆనందరావు, టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ బి. వెంకట్రావ్, సింగరేణి కాలరీస్ గౌరవ సలహాదారు దమ్మాలపాటి శేషయ్య, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. సింగరేణి హెడ్ఆఫీస్లో కంపెనీ డైరెక్టర్ డి. సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. కొత్తగూడెం ఏరియాలో జీఎం సీహెచ్. నర్సింహరావు, మణుగూరు ఏరియాలో జీఎం రమేశ్, ఇల్లెందు ఏరియాలో జీఎం షాలెం రాజు జాతీయ జెండాలను ఎగురవేశారు.
108 అంబులెన్స్ ప్రారంభం
చండ్రుగొండ,వెలుగు: చండ్రుగొండ మండలానికి కొత్తగా కేటాయించిన 108 అంబులెన్స్ వెహికల్‌ను సోమవారం ఎంపీపీ పార్వతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాత వెహికల్ రిపేర్కావడంతో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కొత్తది శాంక్షన్ చేశారన్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్య సమస్యలు గుర్తించి 108 ని కేటాయించడంపై జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీటీసీ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ దారా బాబు, తహసీల్దార్ రవికుమార్
తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ కు ఉత్తమ అధికారి అవార్డు
పెనుబల్లి/వైరా, వెలుగు: రెవెన్యూశాఖలో ఉత్తమ సేవలందించిన పెనుబల్లి మండల తహసీల్దార్ రమాదేవి బెస్ట్ ఫర్పార్మర్ అవార్డు పొందారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం ఖమ్మంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్అవార్డును అందజేశారు. మండలంలో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపడంతో పాటు ధరణి ద్వారా రిజస్ట్రేషన్లు స్పీడ్‌గా పూర్తి చేసినందుకు తనకు అవార్డు దక్కిందని రమాదేవి ఈ సందర్భంగా తెలిపారు.
టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సేవలకు గుర్తింపు
ఖమ్మం ‘సుడా’ జేపీవో, వైరా మున్సిపాలిటీలో ఇన్చార్జి టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న ఇటికాల భాస్కర్ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు దక్కింది. సోమవారం ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన 75 వ స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భాస్కర్ కు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైరా మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటపతిరాజు, మున్సిపల్ చైర్మన్ జైపాల్ భాస్కర్‌కు అభినందనలు తెలిపారు.
వరదల నుంచి కాపాడేందుకు చర్యలు చేపట్టండి
భద్రాచలం,వెలుగు: భద్రాచలం టెంపుల్ టౌన్‌ను వరదల నుంచి కాపాడేందుకు వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని భద్రాద్రికొత్తగూడెం డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య డిమాండ్‌చేశారు. సోమవారం ఆయన తన క్యాంపు ఆఫీస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో మంగళవారం సీఎల్పీ బృందం సభ్యులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, జీవన్‌రెడ్డి, సీతక్క పర్యటిస్తారన్నారు. టౌన్‌లోని కరకట్ట, స్లూయిజ్, విస్తా కాంప్లెక్స్, సుభాష్‌నగర్ కాలనీ, దుమ్ముగూడెం మండలంలోని సున్నం బట్టి, బూర్గంపాడు మండలంలోని సుందరయ్యనగర్, సారపాక, అశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లె గ్రామాల్లో వరద బాధితులను పరామర్శించి వారితో మాట్లాడుతారని తెలిపారు. సమావేశంలో టౌన్ ప్రెసిడెంట్ సరెళ్ల నరేశ్, బోగాల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
భద్రాచలం, వెలుగు: భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పడుతోంది. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో 47.30 అడుగులకు చేరుకోగానే రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. కాగా సాయంత్రం 6 గంటల వరకు ఒక్క అడుగు మాత్రమే తగ్గింది. 46.30 అడుగుల వద్ద మళ్లీ వరద నిలబడింది. ఎగువన గోదావరి పరీవాహక ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షాలతో వరద మళ్లీ క్రమంగా పెరుగుతోంది. పాతగూడెం వద్ద ఇంద్రావతి నది ఉప్పొంగుతుండడంతో పేరూరు వద్ద కూడా స్వల్పంగా పెరుగుతోంది. దీంతో భద్రాచలం వద్ద కూడా మరో రెండు అడుగుల వరకు వరద పెరిగే అవకాశం ఉంది.
పేదల చేతుల్లో లక్షల ఎకరాల పోడుభూమి
పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 92 వేల ఎకరాల పోడు భూములు పేదల చేతిలో ఉన్నాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబ శివరావు అన్నారు. ఆదివారం పాల్వంచలోని చండ్ర రాజేశ్వర రావు భవన్ లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హక్కు పత్రాలు లేవని పోడు భూములను తమ హస్తగతం చేసుకునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. జిల్లాలో విస్తారంగా జల వనరులు, బొగ్గు, ఇసుక ఇతర ఖనిజ సంపద ఉన్నా.. జిల్లాకు ఉపయోగపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాముడి జపం చేస్తున్న బీజేపీ వరదలతో భద్రాద్రి పరిసర ప్రాంతాలు మునిగిపోతున్నా, ఏడు మండలాలు ఏపీలో కలిపినా పట్టించుకోలేదని విమర్శించారు. పాలకులు ఇప్పటికైనా పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని లేకపోతే సీపీఐ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా నాయ కులు ముత్యాల విశ్వనాథం, రావులపల్లి రాంప్రసాద్, బందెల నరసయ్య, గుత్తుల సత్యనారాయణ ,సారయ్య, ఏపూరి బ్రహ్మం, పుల్లారెడ్డి, లక్ష్మీ కుమారి, కల్లూరు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
భద్రాద్రికొత్తగూడెంలో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన నిర్వహించిన వేడుకలకు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హాజరై జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరదల టైంలో అధికారులు చేసిన సేవలు మరువలేనివన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఐటీడీఏ, సీతారామచంద్రస్వామి ఆలయంలో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఎస్పీ వినీత్, అడిషనల్ కలెక్టర్ కె. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంలో..
ఖమ్మం జిల్లా కేంద్రంలోని పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హాజరై మహాత్ముడి ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయజెండా ను ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలతోనే స్వాతంత్య్రం వచ్చిందని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని రంగాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. స్టూడెంట్లు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ శాఖల శకటాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం మంత్రి చేతుల మీదుగా స్వాతంత్ర్య సమర యోధులకు,ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు యస్.వారియర్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి తదితరులు పాల్గొన్నారు.