- క్యాడర్ స్ట్రెంత్ శాంక్షన్ చేయకపోవడంతో ఇబ్బందులు
- మెడికల్ కాలేజీల నుంచి అరకొరగా సర్దుబాటు
- డాక్టర్లు, సిబ్బంది కొరతతో అవస్థలు పడుతున్న పేషెంట్లు
మంచిర్యాల, వెలుగు : వైద్య సేవలను మెరుగుపర్చడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో అప్‌గ్రేడ్ చేసిన హాస్పిటళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు నాలుగేండ్ల కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 76 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ (పీహెచ్‌సీలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్‌సీలు) అప్‌గ్రేడ్ చేస్తూ అప్పటి ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. పీహెచ్‌సీలను 30 బెడ్స్‌కు, సీహెచ్‌సీలను 30 నుంచి 50, మరికొన్నింటిని 100 బెడ్స్ కెపాసిటీకి పెంచి వైద్య విధాన పరిషత్‌కు బదిలీ చేసింది.
పెంచిన బెడ్స్‌కు అనుగుణంగా పలు చోట్ల కొత్త బిల్డింగులను శాంక్షన్ చేసింది. అప్పటివరకు అరకొర సౌలతులు, సిబ్బంది కొరతతో అల్లాడుతున్న హాస్పిటల్స్‌లో వైద్యసేవలు మెరుగు పడతాయని భావించినప్పటికీ నేటికీ అదే పరిస్థితి నెలకొంది.
నో క్యాడర్ స్ట్రెంత్..
హాస్పిటళ్లను అప్‌గ్రేడ్ చేసిన గత సర్కారు వాటికి క్యాడర్ స్ట్రెంత్‌ను శాంక్షన్ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ హాస్పిటల్లో ఎంత మంది డాక్టర్లు, సిబ్బంది, శానిటరీ వర్కర్లు ఉండాలనే లెక్కలు అధికారులు తేల్చలేకపోతున్నారు. 30 బెడ్స్ హాస్పిటల్స్ లో కనీసం 10 మంది డాక్టర్లు, 15 మంది ఇతర స్టాఫ్, 50 బెడ్స్ హాస్పిటల్స్ లో 15 మంది డాక్టర్లు, 20 మందికి పైగా సిబ్బంది అవసరం.
అలాగే 100 బెడ్స్ హాస్పిటల్స్ లో వివిధ విభాగాల్లో 20 మంది డాక్టర్లు, 40 మంది సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. దీంతో ఆయా జిల్లా కేంద్రాల్లోని మెడికల్ కాలేజీల నుంచి టెంపరరీగా కొంత మంది డాక్టర్లు, సిబ్బందిని సర్దుబాటు చేశారు. అత్యవసరమైన గైనిక్, పీడియాట్రిక్, అనస్థీషియా, ఆర్థో, ఆఫ్తాల్మజీ విభాగాలతో పాటు ఎంబీబీఎస్ డాక్టర్లను నియమించారు. అప్పటి నుంచి వాళ్లతోనే కష్టంగా నెట్టుకొస్తున్నారు.
పలుచోట్ల ఇదీ పరిస్థితి..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సీహెచ్‌సీని 30 బెడ్స్ నుంచి 100 బెడ్స్‌కు పెంచి ఏరియా హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ చేశారు. అందుకు అనుగుణంగా కొత్త బిల్డింగ్ సైతం నిర్మించారు. సివిల్ అసిస్టెంట్ 2, డిప్యూటీ సివిల్ సర్జన్ 5, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 11, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 1, సివిల్ అసిస్టెంట్ సర్జన్(జీడీఎంవో) 1తో కలిపి 19 మంది డాక్టర్లతో పాటు 18 కేటగిరీల్లో 43 మంది కలిపి 62 మంది స్టాప్‌ను కేటాయించారు. మెడికల్ కాలేజీ నుంచి టెంపరరీగా 8 మంది డాక్టర్లు, 19 మంది సిబ్బందిని నియమించారు. మరో 7 పోస్టులను కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ద్వారా రిక్రూట్ చేశారు.
ఇంకా 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పేషెంట్లకు సరైన వైద్యం అందడం లేదు. ఎమర్జెన్సీ కేసులను మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)కు రెఫర్ చేస్తున్నారు.100 బెడ్స్‌గా అప్‌గ్రేడ్ చేసినప్పటికీ 30 బెడ్స్ కెపాసిటీతోనే నడుపుతున్నారు. చెన్నూర్‌లో కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇక్కడ 8 మంది డాక్టర్లతో కలిపి 35 మంది స్టాఫ్‌ను కేటాయించగా, 29 మంది పని చేస్తున్నారు. లక్సెట్టిపేటలో 18 మందిని కేటాయించి 9 మందినే నియమించారు. మిగతా 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
త్వరలోనే భర్తీకి సన్నాహాలు..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్‌గ్రేడెడ్ హాస్పిటళ్ల దుస్థితిపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రితో ఉన్నతాధికారులు చర్చించారు. త్వరలోనే 1,600 డాక్టర్ పోస్టుల రిక్రూట్మెంట్ చేపట్టి ఆయా హాస్పిటళ్లలోని ఖాళీలను భర్తీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీస్(డీఎస్‌హెచ్‌ఎస్)గా మార్చిన తరువాత రిక్రూట్మెంట్ చేపట్టనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ ఫైల్ సీఎం పేషీకి చేరినట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయితే త్వరలోనే అప్‌గ్రేడెడ్ హాస్పిటల్స్‌కు మంచిరోజులు వస్తాయని భావిస్తున్నారు.