
- 240 కిలో మీటర్ల మేర 765 కేవీ లైన్ నిర్మాణం
- బీదర్ నుంచి మహేశ్వరం వరకు 624 విద్యుత్ టవర్ల ఏర్పాటు
- గజానికి రూ.1850 చెల్లిస్తున్న సర్కారు
- రూ.250 కోట్ల వరకు పరిహారం చెల్లింపు
చేవెళ్ల, వెలుగు: రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటుగా నగర శివారు ప్రాంతాల్లో కొత్తగా రానున్న కంపెనీలకు విద్యుత్ అంతరాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకలోని బీదర్ నుంచి తెలంగాణకు సోలార్ పవర్ తీసుకురాబోతోంది. దీని కోసం సర్కారు శరవేగంగా పనులు చేస్తోంది. ఇందులో భాగంగా రూ.1,500 కోట్లతో 765 కేవీ (సోలర్ పవర్) లైన్ నిర్మాణ పనులు ఏడాదిన్నరగా రంగారెడ్డి, వికారాబాద్,హైదరాబాద్‌జిల్లాల్లో కొనసాగుతున్నాయి. ఈ పనులు త్వరలోనే పూర్తి కాబోతున్నాయి నగర శివారు ప్రాంతమైన మహేశ్వరం దగ్గర ఉన్న మామిడిపల్లి పవర్ గ్రిడ్‌కు ఈ లైన్ ను అనుసంధానం చేయనున్నారు.
దీని కోసం బీదర్ నుంచి మహేశ్వరం వరకు ఉన్న 240 కిలోమీటర్ల పరిధిలో 624 విద్యుత్ టవర్లు నిర్మిస్తున్నారు. బీదర్‌నుంచి చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట వరకు 306 టవర్లు, చేవెళ్ల శివారు నుంచి మహేశ్వరం కందుకూరు వరకు 318 టవర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ టవర్ల ఏర్పాటు కోసం 650 నుంచి 1500 గజాల వరకు జాగ అవసరం ఉండడంతో రైతులకు సంతృప్తికరమైన పరిహారం ఇచ్చి భూసేకరణ చేస్తున్నారు.
మొదట్లో రూ.700కు గజం.. ఇప్పుడు రూ.1,850
765 కేవీ విద్యుత్ లైన్నిర్మాణం కోసం మొదట్లో ఒక్కో రైతుకు గజానికి రూ.700 ఇస్తామని చెప్పి పనులు మొదలుపెట్టారు. చేవెళ్ల మండలం రేగడి ఘనాపూర్, దేవరంపల్లి, మామిడి పల్లి రైతులు తమవి విలువైన భూములని, ధర పెంచాలని డిమాండ్ చేశారు. కొద్దిరోజులు ఆందోళనలకు దిగారు. కలెక్టర్నారాయణ రెడ్డిని కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. చేవెళ్ల ఆర్డీవో చంద్రకళను విచారణ చేయాలని ఆదేశించడంతో ఆమె భూముల ధరలు పెరిగాయని నివేదిక ఇచ్చింది.
దీంతో రైతుల కోరిక మేరకు ప్రభుత్వం గజం ధరను రూ.700 నుంచి అమాంతం రూ.1850కి పెంచింది. మొత్తం రైతులకు రూ.1850 చొప్పున రూ.250 కోట్ల వరకు రైతులకు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికే రూ.125 కోట్లు చెల్లించింది. మొదటి దశలో మహేశ్వరం నుంచి ఫ్యాబ్ సిటీకి, రెండో దశలో మహబూబ్‌నగర్, మూడో దశలో వరంగల్ కు అవసరాన్ని బట్టి సోలార్‌పవర్‌ను అందించనున్నది. మొత్తంగా 2500 మెగావాట్ల విద్యుత్‌ను ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు.