న్యూఢిల్లీ: తమకు ఉద్యోగం కంటే కుటుంబమే ముఖ్యమని 78 శాతం మంది ఉద్యోగులు ఒక సర్వేలో తెలిపారు. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలన్న ఎల్ అండ్‌టీ చైర్మన్ సుబ్రమణియన్ కామెంట్స్‌పై తీవ్ర వ్యతిరేకత రావడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గ్లోబల్ జాబ్ సైట్ఇండీడ్సర్వే ఉద్యోగుల మనసులో ఏముందో తెలుసుకుంది. కెరీర్లో పైకి రావడం కంటే కుటుంబ సభ్యులతో గడపటమే ముఖ్యమని ప్రతి ఐదుగురిలో నలుగురు వెల్లడించారు. కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం తప్పనిసరని స్పష్టం చేశారు.
ఇండీడ్ రిపోర్ట్ ప్రకారం.. ఆఫీస్‌లో ఒత్తిడి తక్కువ ఉండాలని, మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని ఉద్యోగులు భావిస్తున్నారు. ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం అయినప్పటికీ, వ్యక్తిగత పనులకూ తగినంత సమయం కావాలని అన్నారు. ‘‘ఉద్యోగుల ఆలోచనా విధానం మారుతోంది.
పనికి, కుటుంబ జీవితానికి మధ్య బ్యాలెన్స్ ఉండాలని వాళ్లు బలంగా కోరుకుంటున్నారు. మంచి జీతం తప్పనిసరి అయినా కెరీర్లో పైకి ఎదగడం ఒక్కటే ముఖ్యం కాదని భావిస్తున్నారు”అని ఇండీడ్ సీనియర్ఎగ్జిక్యూటివ్రేచల్ టౌన్స్లీ చెప్పారు. ఇండియాతోపాటు ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్‌లోని 2,507 మంది ఉద్యోగుల అభిప్రాయాలతో ఈ సర్వేను తయారు చేశామని అన్నారు.
జాబ్స్‌పై సానుకూలంగానే..
మన ఉద్యోగులు ఉద్యోగ మార్కెట్ పట్ల కూడా ఆశాజనకంగా ఉన్నారని సర్వే తెలిపింది. ఇందులో పాల్గొన్న వారిలో సగం (55 శాతం) మంది రెస్పాండెంట్లు అభివృద్ధి చెందుతున్న కొత్త రంగాల్లో, పరిశ్రమలలో అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
ప్రొఫెషనల్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటే కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. తగినంత ప్రాక్టికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటే జాబ్సంపాదించడం సులువని పేర్కొన్నారు. జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే ఏఐ, మెషీన్ లెర్నింగ్, కోడింగ్ వంటి టెక్నాలజీలపై పట్టు సంపాదించాలని అన్నారు.
నియామక పద్ధతులు మారాలని పేర్కొన్నారు. సంప్రదాయ డిగ్రీలను మాత్రమే చూడొద్దని, నైపుణ్యాల ఆధారిత నియామకాలపై బలమైన దృష్టి పెట్టాలని 59 శాతం కంటే ఎక్కువ మంది కంపెనీలకు సూచించారు. ట్రెయినింగ్ ప్రోగ్రామ్స్, వర్క్‌షాప్స్, గైడెన్స్ ద్వారా ఉద్యోగుల పనితీరును మెరుగుపర్చాలని అభిప్రాయపడ్డారు.