ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 53,681 శాంపిల్స్ పరీక్షించగా.. 7,813 మందికి పాజిటివ్ వచ్చిందని ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో వెయ్యికిపై కేసులు నమోదు కావడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలో 1324 మందికి, పశ్చిమ గోదావవరి జిల్లాలో 1012 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా బారినపడిన వారి సంఖ్య 88,671కి చేరింది. అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 2,461 మంది, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు 434 మంది ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 43,255 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 44,431 మంది రాష్ట్రంలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఏపీలో కొద్ది రోజులుగా కరోనా మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా కారణంగా 52 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. గుంటూరు జిల్లాలో 9 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 8 మంది, తూర్పు గోదావరి, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా కారణంగా మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 985కి చేరింది.