- వెంటాడుతున్న స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత
- భద్రాద్రికొత్తగూడెం జిల్లా వాసులకు అందని మెరుగైన వైద్య సేవలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 1001 పోస్టులకు గానూ దాదాపు 784 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో నాణ్యమైన వైద్య సేవలు అందడం లేదు. జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నామని గత ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించగానే బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆయన ఫొటోలకు పాలాభిషేకాలు చేశారు.
2021 నవంబర్ మెడికల్ కాలేజ్‌గా ఏర్పాడినప్పటికీ పూర్తి స్థాయిలో పర్మిషన్లు 2022 ఆగష్టులో వచ్చాయి. మెడికల్ కాలేజ్‌లో మొదటి బ్యాచ్‌తో పాటు రెండో బ్యాచ్‌కు క్లాస్‌లు నడుస్తున్నాయి. జిల్లా హాస్పిటల్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా మారింది. కాలేజీకి అనుబంధంగా పట్టణంలోని రామవరంలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. పోస్టుల భర్తీపై బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు.
మొత్తం పోస్టులు 1001 కాగా, 784 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతోంది. జనరల్ హాస్పిటల్లో రోజూ దాదాపు 700కు పైగా ఓపీ ఉంటుంది. కానీ నాణ్యమైన వైద్య సేవలు రోగులకు అందని ద్రాక్షగానే మారింది.
ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి...
కార్డియాలజీ, యూరాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్, సీటీ సర్జన్, న్యూరో ఫిజీషియన్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ లాంటి ముఖ్యమైన స్పెషాలిటీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో జిల్లా వాసులు ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు ట్రీట్మెంట్కు వెళ్లాల్సిందే. డాక్టర్లు లేకపోవడం, రోగుల రద్దీ ఎక్కువగా ఉండడంతో వైద్య సేవలు తూతూ మంత్రంగానే మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టి సారించాలి
ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన ఈ జిల్లాలో పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారు. ఇందులోనూ గిరిజన, దళిత, వెనుకబడిన కులాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. ఈ క్రమంలో ముగ్గురు మంత్రులతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యే హాస్పిటల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.