- టీచర్లపై స్టూడెంట్ల దాడి బాధాకరం
- ఎస్టీయూ మీటింగ్ లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: మారుతున్న సమాజంలో కాలానుగుణంగా దిగజారిపోతున్న నైతిక విలువలను స్టూడెంట్లు, టీచర్లలో పెంపొందించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని ఎస్టీయూ భవన్లో స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్(ఎస్టీయూటీఎస్) 78వ వార్షిక కౌన్సిల్ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ మీటింగ్ కు చాడ వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఎస్టీయూ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కొనసాగడంతో పాటు సర్కారు తీసుకొనే నిర్ణయాలపై క్షేత్రస్థాయిలోని అసంబద్ధ విధానాలపై సూచనలను అందించడం అభినందనీయమన్నారు. ఇటీవల టీచర్లపై స్టూడెంట్లు దాడి చేయడం బాధకరమని, ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా స్టూడెంట్లకు విలువలతో కూడిన చదువులు చెప్పాలని కోరారు. విద్యారంగం, టీచర్లపై ప్రస్తుత సర్కారు సానుకూలంగా ఉండటం శుభసూచకమని, టీచర్ల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు.
రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సంఘం నాయకులు, కార్యకర్తలు తమ వృత్తిలో అంకితభావంతో పనిచేసి, ఆదర్శంగా నిలవాలని కోరారు. ఎన్ని సాంకేతిక విప్లవాలు, డిజిటల్ మాధ్యమాలు వచ్చినా టీచర్ విలువ తగ్గదని పేర్కొన్నారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వత్ రెడ్డి, సదానందంగౌడ్ మాట్లాడుతూ... పీఆర్సీ గడువు ముగిసి ఏడాది దాటినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మూడు పీఆర్సీల ప్రయోజనాలు నష్టపోయినట్టు వెల్లడించారు.
వెంటనే పీఆర్సీని ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఎస్టీయూ బలపరిచిన జాక్టో ఉమ్మడి ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థి పూల రవీందర్ మాట్లాడుతూ... వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. సమావేశంలో ఎస్టీయూ ఫైనాన్స్ సెక్రటరీ ఆట సదయ్య, రాష్ట్ర నేతలు గజేందర్, ఎల్ఎం ప్రసాద్, ఏవీ సుధాకర్, కరుణాకర్ రెడ్డి తదిరతులు పాల్గొన్నారు.