ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య వేడుకలు

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య వేడుకలు

నెట్​వర్క్, వెలుగు :  స్వాతంత్ర్య దినోత్సవాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకగా నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లు, పరేడ్​ గ్రౌండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పార్టీ ఆఫీసులు, సంఘాల కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. మంచిర్యాల కలెక్టరేట్​లో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్​ పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్​సర్కారు ఎజెండా అన్నారు.

సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వం, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం దక్కాలనే లక్ష్యంతో ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందన్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 86 లక్షల 32 వేల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఇతర పథకాలను వివరించారు. వేడుకల్లో మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు, గడ్డం వినోద్, మినిమమ్​ వేజెస్ బోర్డు చైర్మన్​ జనక్​ప్రసాద్, కలెక్టర్​ కుమార్​ దీపక్, అడిషనల్​ కలెక్టర్ ​మోతీలాల్, డీసీపీ భాస్కర్, డీఎఫ్​వో శివ్​ఆశిశ్​ సింగ్​తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజల సంక్షేమం, అభివృద్ధే సర్కార్ ధ్యేయం

ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ అన్నారు. ఆసిఫాబాద్​జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో జరిగిన వేడుకలకు చీఫ్ ​గెస్ట్​గా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు సాగుతోందన్నారు.

ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నామని తెలిపారు. ఇందిరమ్మ గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణు, ఎస్పీ శ్రీనివాస రావు, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, హరీశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాభివృద్ధిలో సింగరేణి సంస్థ కీలకం

మంచిర్యాల, ఆసిఫాబాద్​ జిల్లాలోని సింగరేణి ఏరియాల్లో స్వాతంత్ర్య దిన వేడుకలు గ్రాండ్​గా సాగాయి. మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల జీఎం ఆఫీసుల్లో, జైపూర్ ​ఏస్టీపీపీలో నిర్వహించిన వేడుకల్లో జీఎంలు జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. సింగరేణి సంస్థ అనేక ఒడిదొడుకులు అధిగమించి ఇప్పుడు స్థిరత్వంతో ముందుకుసాగుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోందన్నారు.

రాష్ట్రాభివృద్ధిలో కీలకంగా మారిందన్నారు.  ఈ ఆర్థిక సంవత్సరం 72 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్​ను సమష్టి కృషితో సాధించాలని పిలుపునిచ్చారు. సింగరేణి ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన కార్మికులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.

అభివృద్ధిలో జిల్లా పరుగులు

ప్రజాపాలనలో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి పోలీస్ వందనం స్వీకరించారు. అనంతరం ప్రసంగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరిస్తోందని, ఆరు గ్యారంటీల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 83.22 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసినట్లు చెప్పారు.

గృహజ్యోతి పథకంలో 95 వేల మంది లబ్ధిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తున్నామ, రూ.500 గ్యాస్ సిలిండర్ అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మాటనిలుపుకుందన్నారు. రెండు విడతల్లో 36,387 మంది రైతులకు రూ. 322.29 కోట్లు రుణ మాఫీ చేశామన్నారు. వేడుకల్లో ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మబొజ్జు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందిస్తాం

స్వాతంత్ర్య ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. నిర్మల్​ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన వేడుకలకు చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ‘రైతులందరినీ ఆదుకునేందుకు రుణమాఫీ చేస్తున్నాం. రైతులకు ఆధునిక పంటలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో వైద్యరంగం అభివృద్ధి సాధించేందుకు మార్గం సుగుమమైంది.

విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. గృహ జ్యోతి ద్వారా జిల్లాలో లక్షా 14 వేల కుటుంబాలకు ఉచిత విద్యుత్​ అందిస్తున్నాం. జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం  నిధులు మంజూరు చేస్తోంది’ అన్నారు. వేడుకల్లో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, ఇతర అధికారులు పాల్గొన్నారు. శకటాలు ఆకట్టుకున్నాయి.