నల్గొండ జిల్లాలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లు, రాజకీయ పార్టీల ఆఫీసులు, ప్రభుత్వ, ప్రైవేట్​ స్కూల్స్, కాలేజీలు, వాణిజ్య, వ్యాపార, స్వచ్చంద సంస్థల కార్యాలయాల్లో జాతీయ జెండాలను ప్రముఖులు ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వాంతంత్ర్యోద్యమం, వీరుల పోరాటాన్ని వక్తలు గుర్తు చేసుకున్నారు. దేశభక్తి గేయాలను ఆలపిస్తూ స్టూడెంట్స్​ ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా డ్రగ్స్​ రహిత సమాజం కోసం కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేశారు. స్టూడెంట్స్​ ప్రదర్శించిన దేశభక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. వ్యవసాయ, గ్రామీణాభివృద్ది, వైద్యారోగ్య, విద్య, అటవీ, ఆర్టీసీ, అగ్నిమాపక శాఖల శకటాల ప్రదర్శన జరిగింది. 

కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం ..

యాదాద్రి, వెలుగు : అందరం కలిసి జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామని శాసనమండలి చైర్మన్​గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో నిర్వహించిన 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజాపాలన సాగిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఫ్రీ జర్నీ అవకాశం కల్పించడం ద్వారా 61.21 లక్షల మహిళలకు రూ.31.04 కోట్లు ఆదా అయ్యిందని తెలిపారు. గ్యాస్​పై 1.16 లక్షల మందికి రూ. 7.32 కోట్లు సబ్సిడీ అందించినట్టు చెప్పారు. జీరో కరెంట్ బిల్​కింద రూ.19.89 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు.

ఇప్పటివరకు రూ.375 కోట్లు రుణమాఫీ చేసినట్టు వెల్లడించారు. మరణించిన 555 మంది రైతులకు బీమా కింద రూ. 26.75 కోట్లు అందించినట్టు చెప్పారు. 3536 ఎకరాల్లో సాగు చేస్తున్న ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం రూ. 10. 17 కోట్లు సబ్సిడీ ఇచ్చినట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గంధమల్ల రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పనులను త్వరలో  ప్రారంభిస్తామని తెలిపారు. ఈ వేడుకల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్​హనుమంత్ జెండగే, డీసీపీ రాజేశ్ చంద్ర, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, అడిషనల్​కలెక్టర్లు బెన్​షాలోమ్, గంగాధర్ పాల్గొన్నారు. 

జిల్లా సర్వతో ముఖాభివృద్ధే ధ్యేయం 

  •    మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

సూర్యాపేట, వెలుగు : జిల్లా సర్వతోముఖ అభివృద్ధే ధ్యేయమని, సూర్యాపేటను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతామని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేటలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ సన్ ప్రీతి సింగ్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అండగా ఉంటూ సేవలందించాలన్నారు. అవినీతి రహిత పాలనే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని తెలిపారు. దీంతో జిల్లా రైతాంగం వ్యవసాయాన్ని పండుగలా జరుపుకొంటుందన్నారు. 

రైతు రుణమాఫీలో రాష్ట్రంలో జిల్లా అగ్రభాగం

  •     మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు :  రైతు రుణమాఫీలో రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా అగ్రభాగాన నిలిచిందని రాష్ట్ర రోడ్డు, భవనాలు సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.  పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు

రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర  సృష్టించిందన్నారు.రూ.2 లక్షల వరకు ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయడంతో రైతులు పండుగా చేసుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం 1,71,788 మంది రైతులకు రూ.1421 కోట్ల 35 లక్షల రుణమాఫీ చేశామని వివరించారు.