79 క్వింటాళ్ల నిషేధిత నల్ల బెల్లం పట్టివేత

79 క్వింటాళ్ల నిషేధిత నల్ల బెల్లం పట్టివేత
  • నలుగురు స్మగ్లర్లు అరెస్ట్.. పరారీలో ఇద్దరు
  • డీసీఎం, 2 ఆటోలు,4 ఫోన్లు, రూ.లక్ష క్యాష్​ స్వాధీనం

దిల్ సుఖ్ నగర్, వెలుగు: గుట్టుచప్పుడు కాకుండా నాటుసారా తయారీ కోసం తరలిస్తున్న 79 క్వింటాళ్ల నల్ల బెల్లాన్ని ఎక్సైజ్​ఆఫీసర్లు పట్టుకున్నారు. నాటు సారా తయారీ కోసం కర్నాటక నుంచి తీసుకొస్తున్నట్లు గుర్తించారు. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందిన శివకాంత్, కేతావత్ అరుణ్ నాయక్, సబావత్ హీర్యాసింగ్, మహమ్మద్ బాబా, రమావత్ నరేశ్, కేతావత్ శ్రీను నాయక్ కర్నాటక నుంచి అక్రమంగా నిషేధిత నల్ల బెల్లం, పటికను తీసుకొచ్చి పహాడిషరీఫ్ లోని గోదాంలో నిల్వ చేస్తున్నట్లు ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు మంగళవారం రాత్రి సమాచారం అందింది. వెంటనే గోదాంపై దాడి చేసి 7,860 కిలోల నల్ల బెల్లం, 40 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. సరూర్ నగర్ ఎక్సైజ్​పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

బుధవారం అక్కడ ప్రెస్​మీట్​పెట్టి ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కిషన్ వివరాలు వెల్లడించారు. గోదాంలో భారీ మొత్తంలో నిల్వ చేసిన నల్ల బెల్లం,  పటికను డీసీఎం, రెండు ఆటోల్లో లోడ్​చేస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. వాటి విలువ రూ.12 .50లక్షలు ఉంటుందని తెలిపారు. శివకాంత్, అరుణ్ నాయక్, హీర్యా సింగ్, మహమ్మద్ బాబాను అరెస్ట్ చేశామని, రమావత్ నరేశ్, శ్రీను నాయక్ పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి రూ.1,07,500 నగదు, 4 మొబైల్​ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఆయనతో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్, సరూర్ నగర్ ఎక్సైజ్ ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది బాలరాజు, చంద్రశేఖర్ ఉన్నారు.