ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 62,979 శాంపిల్స్ పరీక్షించగా.. 7,948మందికి పాజిటివ్ వచ్చిందని ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. రెండు జిల్లాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదు కావడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలో 1367 మందికి, కర్నూలు జిల్లాలో 1146 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా 58 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా బారినపడిన వారి సంఖ్య 1,10,297కి చేరింది. అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 2,461 మంది, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు 434 మంది ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 52,622 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 56,527 మంది రాష్ట్రంలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఏపీలో కొన్నాళ్లుగా ప్రతి రోజూ 50 మందికి పైగా కరోనాకు బలవుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా కారణంగా 58 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. గుంటూరు జిల్లాలో 11 మంది, కర్నూలులో 10 మంది, విశాఖలో 9 మంది మరణించారు. చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఐదుగురి చొప్పున, నెల్లూరు, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో నలుగురి చొప్పున కరోనాతో మృతి చెందారు. అనంతపురంలో ముగ్గురు, కడప, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 1148కి చేరింది.