
- సిమ్రన్, సెమాకు కాంస్య పతకాలు
- ప్రాచి, పూజ, దిలీప్‌కు నిరాశ
- ఇండియా ఖాతాలో మొత్తం 29 మెడల్స్
పారిస్: పారాలింపిక్స్‌లో ఇండియా పారాలింపియన్లు అదరహో అనిపించారు. శనివారం కూడా రెండు పతకాలతో మెరిశారు. అయితే మెన్స్ ఎఫ్41 జావెలిన్ త్రోలో నవ్‌దీప్ సింగ్ సిల్వర్ నుంచి స్వర్ణానికి అప్‌గ్రేడ్ అయ్యాడు. దీంతో ఇండియా ఖాతాలో ఏడో గోల్డ్ వచ్చి చేరింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో నవ్‌దీప్ జావెలిన్‌ను 47.32 మీటర్ల (పర్సనల్ బెస్ట్) దూరం విసిరి రెండో ప్లేస్‌లో నిలిచాడు. ఇరాన్ అథ్లెట్ సదేగ్ బీత్ సయీ 47.64 మీటర్లతో టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే అనూహ్యంగా సదేగ్‌పై అనర్హత వేటు పడటంతో నవ్‌దీప్‌కు బంగారు పతకం దక్కింది. దీంతో జావెలిన్ ఎఫ్41 స్వర్ణం సాధించిన తొలి ఇండియన్ పారాలింపియన్‌గా నవ్‌దీప్ రికార్డులకెక్కాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్ అయిన నవ్‌దీప్ రెండో ప్రయత్నంలో 46.39 మీటర్లను అందుకున్నాడు. అదే జోరులో మూడో ప్రయత్నంలో ఈటెను 47.32 మీటర్ల దూరం విసిరాడు.
సిమ్రన్ కాంస్య పరుగు
విమెన్స్ 200 మీటర్ల టీ12 ఫైనల్లో సిమ్రన్ శర్మ కాంస్యంతో మెరిసింది. ఫైనల్లో సిమ్రన్ 24.75 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. ఒమరా డురాండ్ ఎలిస్ (క్యూబా, 23.62 సె), పావోలా లోపెజ్ (వెనిజులా, 24.19సె) వరుసగా గోల్డ్, సిల్వర్ సాధించారు. కంటి చూపు తక్కువగా ఉన్న అథ్లెట్లు టీ12 రేస్‌లో పాల్గొంటారు. స్టార్టింగ్‌లో ఒమరా, లోపెజ్‌తో సమంగా పరుగెత్తిన సిమ్రన్ చివర్లో కాస్త తడబడింది. అయితే ఇరాన్ రన్నర్ హజార్ సర్ఫార్జెడ్ నుంచి పోటీ ఎక్కువైనా తృటిలో ఓటమి నుంచి బయటపడి మూడో స్థానంలో నిలిచి పతకం అందుకుంది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన షాట్‌పుట్ ఎఫ్57లో సెమా హొటోజి ఇనుప గుండును 14.65 మీటర్ల దూరం విసిరి మూడో ప్లేస్‌తో బ్రాంజ్‌ను సాధించాడు. సోమన్ రవి (14.07 మీ) ఐదో ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు.
ప్రాచీ యాదవ్‌కు ఎనిమిదో స్థానం
విమెన్స్ వీఎస్2, 200 కనోయి స్ప్రింట్ ఫైనల్లో ప్రాచీ యాదవ్ ఎనిమిదో ప్లేస్‌లో నిలిచింది. ఫైనల్లో ఆమె 1:08.55 సెకన్ల టైమింగ్ నమోదు చేసింది. మెన్స్ కేఎల్1,200 సెమీస్‌లో యష్ కుమార్ (1:02.03సెకన్లు) ఐదో ప్లేస్‌లో నిలిచాడు. విమెన్స్ కేఎల్ 1, 200 సెమీస్‌లో పూజా ఓజా (1:17.23 సెకన్లు) నాలుగో ప్లేస్‌తో సంతృప్తి పడింది.
మెన్స్ 400మీ. టీ47 ఫైనల్లో దిలిప్ గవిట్ మహుడు 49.99 సెకన్లతో ఎనిమిదో ప్లేస్‌లో నిలిచాడు. స్విమ్మింగ్‌లోనూ ఇండియాకు నిరాశే ఎదురైంది. మెన్స్ 50 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఎస్7 హీట్స్–1లో సుయాష్ యాదవ్ 33.47 సెకన్లతో ఐదో ప్లేస్‌లో నిలిచాడు.
ఇండియా @ 29
ఓవరాల్‌గా పారాలింపిక్స్‌లో ఇండియా అనుకున్న దానికంటే ఎక్కువ పతకాలే సాధించింది. కొంత మంది స్టార్లు అంచనాలు అందుకోవడంలో ఫెయిలైనా.. మరికొంత మంది అనూహ్యంగా పోడియం ఫినిష్ చేశారు. ఈసారి గేమ్స్‌లో ఇండియా రికార్డు స్థాయిలో 29 (7 గోల్డ్, 9 సిల్వర్, 13 బ్రాంజ్) మెడల్స్‌తో 18వ ప్లేస్‌లో నిలిచింది. 2016 రియోలో కేవలం నాలుగు పతకాలు నెగ్గిన ఇండియా టోక్యోలో 19కు పెరిగింది. మళ్లీ ఇప్పుడు 29 మెడల్స్‌తో సూపర్ పెర్ఫామెన్స్ చేసింది. ఇక ఆదివారం రాత్రి జరిగిన ముగింపు కార్యక్రమం ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది.
రెండుసార్లు ఎల్లో కార్డు..
పోటీ ఆరంభం నుంచి మంచి పెర్ఫామెన్స్ చేసిన సదేగ్ చివర్లో చేసిన తప్పుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. గోల్డ్ గెలిచిన ఆనందంలో తన జాతీయ జెండాను కాకుండా వేరే జెండా (బ్లాక్)ను ప్రదర్శించాడు. దీంతో అతనిపై పారాలింపియన్ కమిటీ తీవ్ర చర్యలు తీసుకుంది. 8.1 రూల్ ప్రకారం గేమ్స్‌లో తమ జాతీయ జెండాను తప్ప మిగతా ఏ జెండాలను ప్రదర్శించకూడదు. గేమ్స్ సందర్భంగా ఈ రూల్‌ను సదేగ్ రెండుసార్లు ఉల్లంఘించడంతో ఎల్లో కార్డులకు గురయ్యాడు. రెండు ఎల్లో కార్డులు రావడంతో చివరికి అతనికి రెడ్ కార్డు ఇచ్చి పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. ఫలితంగా రెండో ప్లేస్‌లో ఉన్న నవ్‌దీప్ స్వర్ణానికి అప్‌గ్రేడ్ అయ్యాడు. సున్ పెంగ్సియాంగ్ (చైనా, 44.72 మీ.), విల్డాన్ నుకలివాయ్ (ఇరాక్, 40.46 మీ.) సిల్వర్, బ్రాంజ్ గెలిచారు.