హైదరాబాద్ సిటీ, వెలుగు : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మూడురోజులపాటు ధూమ్‌ధామ్‌గా సాగిన 7వ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ బుధవారంతో ముగిసింది. 19 దేశాల నుంచి 47 మంది, దేశంలోని13 రాష్ట్రాలకు చెందిన 60 మంది కైట్ఫ్లయర్స్ వివిధ రకాల రంగురంగుల పతంగులతో సందడి చేశారు. తెలంగాణ వంటకాలతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన ఫేమస్ స్వీట్స్ సిటీ జనాల నోరూరించాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారుల పేరిణి, ఒగ్గు డోలు, డప్పు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ముగింపు కార్యక్రమానికి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ డా. వెన్నెల గద్దర్, టూరిజం కార్యదర్శి స్మితా సభర్వాల్, డీసీపీ రష్మి పెరుమాళ్, టూరిజం డైరెక్టర్ జెడ్. కె. హనుమంతు, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ హాజరయ్యారు. జాతీయ, అంతర్జాతీయ కైట్ఫ్లయర్స్ను సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఈసారి1500 స్టాళ్లు ఏర్పాటు చేయగా,15 లక్షల మంది ప్రజలు తిలకించారన్నారు. ఫెస్టివల్‌ను అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో విజయవంతం చేశారన్నారు. మూడు రోజులూ రాత్రిపూట లైట్లతో కూడిన పతంగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి