జనవరి 13 నుంచి కైట్ ఫెస్టివ‌‌ల్.. సికింద్రాబాద్ ప‌‌రేడ్ గ్రౌండ్​లో 15వ‌‌ర‌‌కు వేడుకలు

జనవరి 13 నుంచి కైట్ ఫెస్టివ‌‌ల్.. సికింద్రాబాద్ ప‌‌రేడ్ గ్రౌండ్​లో 15వ‌‌ర‌‌కు వేడుకలు
  • పోస్టర్​ను ఆవిష్కరించిన మంత్రి జూప‌‌ల్లి
  • ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 7వ  అంత‌‌ర్జాతీయ కైట్, స్వీట్  ఫెస్టివ‌‌ల్ నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో  19  దేశాల నుంచి 47 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, 14 రాష్ట్రాల నుంచి 60 దేశవాళి కైట్ క్లబ్ సభ్యులు పాల్గొంటారు. అంతేగాక.. జాతీయ‌‌, అంతర్జాతీయ  స్వీట్లను, తెలంగాణ పిండి వంట‌‌ల‌‌ను  స్టాళ్లలో  అందుబాటులో ఉంచనున్నారు.  శనివారం బేగంపేట్ హ‌‌రిత ప్లాజాలో ప‌‌ర్యాట‌‌క శాఖ‌‌ శాఖ మంత్రి జూప‌‌ల్లి కృష్ణారావు ఇంట‌‌ర్నేష‌‌నల్ కైట్, స్వీట్ ఫెస్టివ‌‌ల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

అనంతరం జూప‌‌ల్లి మాట్లాడుతూ.." తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అంత‌‌ర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివ‌‌ల్‌‌ నిర్వహించనున్నాం. సందర్శకులకు ఉచిత ప్రవేశం ఉంటుంది. రాబోయే రోజుల్లో కైట్‌‌ స్వీట్‌‌ ఫెస్టివల్‌‌ను అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాం. రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాలు, వార‌‌స‌‌త్వ క‌‌ట్టడాలు, ప్రాచీన దేవాలయాలను సంద‌‌ర్శించాల‌‌ని విజ్ఞప్తి చేస్తున్న. దీని వల్ల సంస్కృతి, సంప్రదాయాలు తెలీడంతోపాటు స్థానికుల‌‌కు ఉద్యోగ‌‌, ఉపాధి అవ‌‌కాశాలు ల‌‌భిస్తాయి" అని మంత్రి పేర్కొన్నారు. కైట్ ఫెస్టివ‌‌ల్ ను సందర్శించే వారికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 

కైట్ ఫెస్టివ‌‌ల్ తెలంగాణ ప్రత్యేక‌‌త‌‌: స్మితా స‌‌బ‌‌ర్వాల్ 

ప‌‌ర్యాట‌‌క శాఖ కార్యద‌‌ర్శి స్మితా స‌‌బ‌‌ర్వాల్ మాట్లాడుతూ..దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇలాంటి ఫెస్టివ‌‌ల్ ఎక్కడా నిర్వహించ‌‌ర‌‌ని, అదే తెలంగాణ ప్రత్యేక‌‌త‌‌ అని అన్నారు. కైట్ ఫెస్టివల్​లో  సాంస్కృతిక కార్యక్రమాలు, హ‌‌స్తక‌‌ళ‌‌లు, చేనేత వ‌‌స్త్రాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప‌‌ర్యాట‌‌క శాఖ  సంచాల‌‌కులు జెండ‌‌గే హ‌‌నుమంతు, భాషా, సాంస్కృతిక శాఖ సంచాల‌‌కులు మామిడి హ‌‌రికృష్ణ, కైట్ ఫెస్టివ‌‌ల్ క‌‌న్సల్టెంట్ ప‌‌వ‌‌న్. డి. సోలంకి, క్లిక్  క‌‌న్వీన‌‌ర్ లిబి బెంజిమ‌‌న్,  దేశీయ‌‌, అంత‌‌ర్జాతీయ క్లైట్ ప్లేయ‌‌ర్స్, వివిధ రాష్ట్రాల‌‌కు చెందిన ప్రతినిధులు, త‌‌దిత‌‌రులు పాల్గొన్నారు. కాగా..కైట్ ఫెస్టివల్ కు మూడు రోజుల్లో 15 లక్షల మంది దాకా వస్తారని అంచనా ఉంది. వారికి అసౌకర్యం కలగకుండా జీహెచ్ఎంసీ, పోలీసు, ఇతర శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.