గుడ్ న్యూస్: నవంబర్ 7న పబ్లిక్ హాలీ డే.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

గుడ్ న్యూస్: నవంబర్ 7న పబ్లిక్ హాలీ డే.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఛత్ పూజ సందర్భంగా 2024, నవంబర్ 7వ తేదీన పబ్లిక్ హాలీ డే ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 1) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని ఎన్సీటీ ప్రజలకు ఛత్ పూజ ఒక ముఖ్యమైన పండుగ అని.. దీనిని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 7వ తేదీన పబ్లిక్ హాలీడే ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.  ఛత్ పండుగ కోసం నగరవ్యాప్తంగా 1000 మోడల్ ఘాట్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం అతిశీ తెలిపారు. 

ఢిల్లీలో లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఛత్ పూజను సులభతరం చేసేందుకు 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాత్కలిక ఘాట్‌లను నిర్మిస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. ఘాట్‌ల వద్ద లైటింగ్, పరిశుభ్రమైన నీరు, మరుగుదొడ్లు, టెంట్లు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను సీఎం అతిశీ ఆదేశించారు. ఈ మేరకు ఛత్ పూజ కమిటీలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఛత్ పూజను జరుపుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం కట్టుబడి ఉందని భక్తులకు ఆమె హామీ ఇచ్చారు. 

కాగా, దీపావళి పండుగ తర్వాత ఛత్ పూజను జరుపుకుంటారు. ఛత్ పూజ ఎక్కువగా ఉత్తర భారతదేశంలో సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా 'పూర్వాంచాలిస్' (బీహార్, తూర్పు యూపీ స్థానికులు) పెద్ద ఎత్తున ఛత్ పూజను జరుపుకుంటారు. ఛత్ పూజలో భాగంగా భక్తులు సూర్యదేవుడిని ఆరాధిస్తారు. ఎక్కువగా మహిళలు ఈ ఛత్ పూజలో పాల్గొంటారు. భక్తులు మోకాళ్ల లోతు నీటిలో నిలబడి 'అర్ఘ్య' ఆచారాన్ని పాటిస్తారు. 

ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది (2025) ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలోని 'పూర్వాంచలి' ఓటర్లు అనేక స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలరు. దీనిని పరిగణలోకి తీసుకున్న ఆప్ సర్కార్.. పూర్వాంచలి ఓటర్లకు దగ్గర కావడం కోసం ఛత్ పూజకు పబ్లిక్ హాలీ డే ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది.